Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంటకోత ప్రయోగంలో ‘సున్నా’ దిగుబడి!

రాజమహేంద్రవరం రూరల్‌, డిసెంబరు 1: భారీ వర్షాల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారని బొమ్మూరులో పంటకోత ప్రయోగ దిగుబడి నిరూపించింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్వే నెం.62లో వరి పంటకోత ప్రయోగంలో సున్నా దిగుబడి నమోదైంది. బడ్డేటి గోవిందు బొమ్మూరులో దేవస్థానం భూమిని కౌలుకు తీసుకుని ఎంటీయూ 7029 వరి రకాన్ని సాగుచేశారు. వర్షాల కారణంగా పంటకోత ప్రయోగ పొలం కుళ్లిపోయి మొలకలు వచ్చాయి. రైతు గోవిందు మాట్లాడుతూ వ్యయప్రయాసలకోర్చి సాగుచేసిన వరి పంట వర్షానికి కుళ్లిపోయి ఒక్క గింజ ధాన్యం కూడా రాలేదన్నారు. వ్యవసాయాధికారి కె శ్రీనివాస్‌, విస్తరణాధికారి వేణుమాధవ్‌, గణాంకాధికారి కె వరప్రసాద్‌, వ్యవసాయ సహాయకులు రాహుల్‌ పంట పొలాన్ని పరిశీలించారు. 

కోతలు వాయిదా వేయండి

డిసెంబర్‌ 3, 4 తేదీల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున నూర్పిడి చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపించడం, కోత అవ్వని పంటను రెండ్రోజుల పాటు వాయిదా వేయమని రైతులకు సమాచారం అందించాలంటూ గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులకు ఆదేశాలు ఇచ్చినట్టు ఏడీ కె సావిత్రి తెలిపారు. 

Advertisement
Advertisement