Share News

YSRCP Manifesto: బాబోయ్.. జగన్ మేనిఫెస్టోపై జనం, వైసీపీ శ్రేణుల నుంచి షాకింగ్ రియాక్షన్.. ఓ లుక్కేయండి!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:18 PM

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజలు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. జగన్ వీరాభిమానులు స్పందిస్తున్నారు. వారి రియాక్షన్ చూస్తే...

YSRCP Manifesto: బాబోయ్.. జగన్ మేనిఫెస్టోపై జనం, వైసీపీ శ్రేణుల నుంచి షాకింగ్ రియాక్షన్.. ఓ లుక్కేయండి!

  • ఇదేం మేనిఫెస్టో!

  • పెదవి విరుస్తున్న ప్రజలు..

  • తలలు పట్టుకుంటున్న అధికార పార్టీ శ్రేణులు

  • నాలుగేళ్ల తర్వాత పెన్షన్‌ పెంచుతామంటూ సీఎం ప్రకటనపై వృద్ధుల పెదవి విరుపు

  • అధికారంలోకి రాగానే నాలుగు వేలు చేస్తామంటున్న టీడీపీ కూటమి

  • అమ్మ ఒడి రూ.17 వేలకు పెంపు.. అదీ ఒక్కరికేనంటున్న వైసీపీ

  • ఎంత మంది పిల్లలను చదివిస్తే అందరికీ ఇస్తామంటున్న చంద్రబాబు

  • పోలవరం, జలయజ్ఞం పూర్తి చేస్తామంటూ మళ్లీ అదే హామీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) శనివారం నాడు ప్రకటించిన వైసీపీ మేనిఫెస్టో (YSRCP Manifesto) తేలిపోయింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు, ప్రజల్లోనూ ఇదే భావన వ్యక్తమవుతోంది. టీడీపీ– జనసేన – బీజేపీ కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ ముందు వెలవెలబోయింది. ఒక్కో పథకాన్ని విశ్లేషిస్తే ఇదే విషయం అర్థమవుతోంది.


భీమవరం/ఏలూరు రూరల్‌/నూజివీడు, ఆంధ్రజ్యోతి:

వృద్ధులు, వికలాంగులకు ప్రస్తుతం మూడు వేలు పింఛన్‌ ఇస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే నెలకు రూ.4,000 పెన్షన్‌ ఇస్తామని, అది కూడా ఈ ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తా మని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు వెయ్యి చొప్పున బకాయి కలి పి జూలైలో మొత్తం రూ.7 వేలు ఇంటికే అందజేస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రతి నెలా రూ.4 వేలు ఇవ్వనున్నారు. కాని వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోలో పింఛన్‌ను మూడు వేల 500కు పెంచుతూ పోతానని చెప్పారు. అంటే నాలుగేళ్లపాటు మూడు వేలు చొప్పున ఇచ్చి, ఆ తర్వాత ఏడాది రూ.3,250, ఐదో ఏడాది రూ.3500 ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇదే ఇప్పుడు పింఛన్‌దారుల్లో చర్చగా మారింది.

mani.jpg

మహిళలకు అలా..?

మరోవైపు బీసీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్‌ను ఇస్తామంటూ కూటమి హామీ ఇచ్చింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ గొప్పగా చెబుతున్న జగన్‌ ఇప్పుడు కొత్త లెక్కలు చెప్పుకొచ్చారు. అమ్మ ఒడిని రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచనున్నారు. ఇందులో రూ.2 వేలు పాఠశాలల నిర్వహణకు మినహాయిస్తా మని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఇంటిలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంత మంది పిల్లలు వుంటే అందరికి రూ.15 వేలు వంతున ఇవ్వనున్నట్టు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ఇక్కడ కూడా కూటమిదే పైచేయిగా నిలిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.18,500 ఇచ్చారు. మరో ఐదేళ్లపాటు ఇదే కొన సాగిస్తామని వైసీపీ చెప్పుకొచ్చింది. అది కూడా 45 ఏళ్లు దాటి 60 ఏళ్లలోపు మహిళలకు అందజేసింది. కూటమి మాత్రం 18 ఏళ్లు నిండిన మహిళలకు మహలక్ష్మి పథకంలో నెలకు రూ.1500 ఇవ్వనున్నారు. ఇలా సంక్షేమ పథకంలో అమలులోనూ కూటమి మేనిఫెస్టో ముందు వరసలో ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితం వంటి పథకాలను సూపర్‌ సిక్స్‌లో టీడీపీ కూటమి పొందుపరిచింది.


కార్పొరేషన్‌ల ఊసే లేదు!

వైసీపీలో 53 కార్పొరేషన్‌లు ఏర్పాటుచేశారు. ఒక్క దానికి నిధులు కేటాయించలేదు. ఇప్పుడు కార్పొరేషన్ల కోసం పెద్దగా పట్టించుకోలేదు. అదే కూటమి అయితే బీసీ సబ్‌ ప్లాన్‌ అమలు చేసి రాయితీ రుణాలు అందజేస్తామని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించేది లేదని, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన 23 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని చంద్ర బాబు భరోసా ఇచ్చారు.

మరో ఐదేళ్లలో పోలవరం పూర్తి

టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం మేర పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేశారు. రివర్స్‌ టెండరింగ్‌ అంటూ వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి వేసింది. ఐదేళ్లపాటు ప్రాజెక్ట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. మరో ఐదేళ్లలో పూర్తి చేస్తామంటూ జగన్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందంటూ ప్రతిపక్షాలు దెప్పి పొడుస్తున్నాయి. పోలవరంతోపాటు, అమరావతి రాజధాని ని పూర్తి చేస్తామని కూటమి ప్రకటించింది. మూడు రాజధా నులన్న జగన్‌ మేనిఫెస్టోలో ఆ విషయాన్నే పెద్దగా ప్రస్తావించ లేదు. మరోవైపు హార్బర్‌లు పూర్తి చేస్తామంటూ జగన్‌ ప్రకటిం చడంపై అంతా పెదవి విరుస్తున్నారు. జిల్లాలో బియ్యపుతిప్ప వద్ద హార్బర్‌కు ఇప్పటి వరకు పునాది రాయి వేయలేదు. ఆక్వా యూనివర్శిటీ తరగతులు ప్రారంభించలేదు. మెడికల్‌ కళాశాల అంటూ ఊదరగొట్టి కనీసం పూడిక చేయలేదు. మరో ఐదేళ్లలో వాటిని పూర్తి చేస్తామంటూ జగన్‌ చెప్పుకొచ్చారు. జలయజ్ఞం పూర్తిచేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. ఐదేళ్లలో జిల్లాలో వరి రైతులకు ఉపయోగపడే కాలువలను మరమ్మతులు చేపట్ట లేకపోయారు. బిల్లులు చెల్లించలేదు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ లకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు వాటికి అనుమ తులు మంజూరు చేయలేదు. దీంతో వైసీపీ మేనిఫెస్టోపై విశ్వస నీయత లేదంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది.

Jagan-Released-Manifesto.jpg

పీజీ కోర్సులకు రీయింబర్స్‌ లేదు!

వైసీపీ హయాంలో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను తొలగించారు. జిల్లాలో అధిక సంఖ్యలో విద్యార్థులు పీజీ కోర్సులకు దూరమయ్యారు. తాజా మేనిఫెస్టోలోను దీని ప్రస్తావ న లేదు. బకాయిలను చెల్లించలేదు. అదే కూటమి అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధిని కొనసాగిస్తామని కూటమి ప్రకటించింది. అదే హామీతో జనంలోకి వెళుతున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అమలు చేస్తామని కూటమి ఎన్నికల హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతిని అందజేయనున్నట్టు స్పష్టం చేసింది.


రైతుకు ఉత్తుత్తి హామీలేనా!

రైతులకు రూ.12,500 రైతు భరోసా ఇస్తామని జగన్‌ గత ఎన్నికల ముందు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. ఆరు వేలకు అదనంగా రూ.7,500 మాత్రమే ఇచ్చారు. మరోసారి రైతులకు అదనంగా ఏమి చేస్తారో జగన్‌ చెప్పలేకపోయారు. అదే టీడీపీ కూటమి రైతుకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేస్తామంటూ హామీ ఇచ్చింది. ఆక్వా రంగానికి జోన్‌తో నిమిత్తం లేకుండా రూ.1.50లకే యూనిట్‌ విద్యుత్‌ అందజేయనున్నట్టు భరోసా కల్పించింది. పండ్ల తోటలకు సబ్సిడీలు అటకె క్కాయి. డ్రిప్‌ ఇరిగేషన్‌ పూర్తిగా కనుమరుగైంది. ఇలా చెబుతూ పోతే 2019లో వైసీపీ ఇచ్చిన హామీలో కొంత వరకే అమలు చేశారు. ఇళ్ళు, ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయంలో లబ్ధిదారు లకు నిరాశే మిగిలింది.

Super-Six-Vs-Jagan-Manifest.jpg

పాత సీసాలో పాత సారా!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో పాత సీసాలో పాత సారా మాదిరిగా ఉంది. వృద్ధులకు పెన్షన్‌ను 2028 నుంచి రూ. 500 పెంచుతారట. అదే కూటమి అధికారంలోకి వస్తే ఈ ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పెన్షన్‌ అమలు చేస్తుంది. జూలైలో ఒకేసారి రూ.7 వేలు పెన్షన్‌ అందిస్తుంది. అమ్మ ఒడికి రూ.2 వేలు పెంచారు. ఒక్క పిల్లాడికి మాత్రమే ఇస్తారు. అదే కూటమి అయితే ఎంత మంది పిల్లలుంటే అన్ని రూ.15 వేలు ఇస్తారు. మహిళలకు రూ. 18,500 ఇస్తామంటున్నారు. అదే చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహలక్ష్మి పథకంలో 18 ఏళ్లు దాటిన మహిళలకు రూ.1,500 ఇస్తారు. – ఎంపీ రఘురామకృష్ణరాజు

కాపు నేస్తం కాదు.. దగా నేస్తం

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసి కాపు సామాజిక వర్గం నవ్వుకుంటు న్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.10 వేల కోట్లు అందిస్తామని, గత ఎన్నికల్లో హామీ ఇచ్చి రూ.2 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. కాపునేస్తం పేరిట మహిళలకు రూ.15 వేలు ఇస్తానని, అనేక కోతలు విధించి కాపు సామాజిక వర్గాన్ని దెబ్బ తీశారు. 2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాపులను బీసీలుగా చేరుస్తారని హామీ ఇచ్చి మోసం చేశారు. కాపు కార్పొరేషన్‌ను ఈ ప్రభుత్వం అలంకార ప్రాయంగా మార్చింది. – ముత్యాల కామేష్‌, నూజివీడు

Jagan-Manifesto.jpg

మద్య నిషేధం ఏమైంది..?

వైఎస్‌ఆర్‌ చేయూతను వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామని, అమ్మ ఒడిని మరింత పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు అనేక కొర్రీలు విధించిన విషయం మహిళలు మర్చిపోలేరు. మద్య నిషేధం అమలు చేస్తానని ఇచ్చిన హామీ అమలు పరచకుండా మద్యం ధరలను విపరీతంగా పెంచి నాసి రకపు మద్యాన్ని అమ్ముతూ ఎంతో మంది మహిళల ఉసురును ఈ వైసీపీ ప్రభుత్వం తీసింది. మహిళలు ఎవరూ వైసీపీకి అండగా నిలిచేందుకు సిద్ధంగా లేరు.

– ఎం.లక్ష్మీకాంతమ్మ, సర్పంచ్‌, బత్తులవారిగూడెం

హామీలతోనే సరి..

న్యాయవాదుల సంక్షేమానికి ఎంతో చేస్తామని హామీలు ఇవ్వడంతోనే జగన్‌రెడ్డి సర్కార్‌ సరిపెట్టింది. వైఎస్సార్‌ ‘లా’ నేస్తం ద్వారా రూ.5 వేలు స్టైఫండ్‌ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం న్యాయవాదులకు ఇవ్వాల్సిన రూ.100 కోట్లు ఇప్పటికీ చెల్లించలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన డెత్‌ బెన్‌ఫిట్స్‌ను చెల్లించకుండా న్యాయవాద కుటుంబాలను ఈ ప్రభుత్వం మోసగిస్తోంది. – డి.సూర్యనాథ్‌, అడ్వకేట్‌, నూజివీడు.

Updated Date - Apr 28 , 2024 | 12:31 PM