Share News

TS Lok Sabha Polls: మిగిలింది మూడు రోజులే.. జోరు పెంచిన అభ్యర్థులు

ABN , Publish Date - May 09 , 2024 | 03:40 PM

పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది.. ఇక మిగిలింది మూడు రోజులే.

TS Lok Sabha Polls: మిగిలింది మూడు రోజులే.. జోరు పెంచిన అభ్యర్థులు

  • ఆఖరి అంకానికి ప్రచార పర్వం

  • సభలు, సమావేశాలు, సమీక్షల జోరు

  • నియోజకవర్గాన్ని చుట్టొస్తున్న అభ్యర్థులు

  • కుల, కాలనీ సంఘాలతో భేటీలు

  • ఓటర్ల మూడ్‌ పసిగట్టేందుకు సర్వేలు

  • ప్రైవేట్‌ ఏజెన్సీలతో ఓటర్లకు ఫోన్‌కాల్స్‌

హైదరాబాద్‌ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ తేదీ సమీపిస్తోంది.. ఇక మిగిలింది మూడు రోజులే. ఈ క్రమంలో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. రోజుకు రెండు, మూడుచోట్ల బహిరంగ సమావేశాలతోపాటు కార్నర్‌ మీటింగుల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే చేపట్టనున్న అభివృద్ధి పనులేమిటో ఆయా పార్టీల నేతలు ఓటర్లకు వివరిస్తున్నారు. మరోపక్క సర్వేలు కూడా ముమ్మరంగా చేయిస్తున్నారు. ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా ఓటర్లకు ఫోన్లు చేయిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. మీ ప్రాంతంలో ఎంపీగా ఎవరు పోటీ చేస్తున్నారు? మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. పనిలో పనిగా ఫలానా పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్తులో మీకు మేలు జరుగుతుందంటూ కూడా చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్‌లోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో పోరు రసవత్తరంగా ఉంది. రాష్ట్రంలో పాలన చేపడుతున్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు అన్ని అస్త్రశస్త్రాలతో పోరు సల్పుతున్నాయి.

రోజుకు రెండు, మూడు కాల్స్‌

థర్డ్‌ పార్టీ ద్వారా ఓటర్ల ఫోన్‌ నంబర్లను సేకరిస్తున్న పార్టీల నాయకులు వారికి రోజుకు రెండుమూడు ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు పంపిస్తూ ఓటర్ల మనోగతం తెలుసుకుంటున్నారు. అభ్యర్థి వాయి్‌సను కాల్‌ రూపంలో పంపిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండడంతో ఓటర్లు కొందరు అసహనానికి లోనవుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న సమయంలో తెలియని నంబర్‌ నుంచి ఫోన్‌ రావడంతో ఎత్తుతున్నారు. తీరా కాల్‌ లిఫ్ట్‌ చేసిన తర్వాత మీరు ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు.. ఏ పార్టీకి మద్దతు తెలపాలని భావిస్తున్నారు.. అని అవతలి వ్యక్తులు అడుగుతున్నారు. మరికొన్ని కాల్స్‌ నేరుగా అభ్యర్థి మాట్లాడినట్లుగానే వస్తున్నాయని, ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించాలని కోరుతున్నారని ఓటర్లు వాపోతున్నారు. ఆఫీసులకు, అత్యవసర పనులకు వెళ్తున్న సమయంలో తెలియని నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, ఎత్తిన తర్వాత ఎన్నికల సమాచారం అడుగుతుండడంతో వెంటనే కట్‌ చేస్తున్నామని చెబుతున్నారు.

సర్వేల ఆధారంగా ముందుకు..

ఫోన్‌కాల్స్‌తోపాటు క్షేత్రస్థాయిలో చేస్తున్న సర్వేల్లో అభ్యర్థి లేదా పార్టీపట్ల ఏమైనా వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం అందితే ఆయా పార్టీలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు కొంతమంది వ్యక్తులతో ఇటీవల తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో రహస్యంగా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. పలుచోట్ల వారికి అనుకూలత లేకపోవడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలను పెద్దఎత్తున దింపి జోరుగా ప్రచారం చేయిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా జరిగే అభివృద్ధిని వివరిస్తున్నారు. కుల సంఘాలు, కాలనీలు, బస్తీవాసులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయించి వారిని తమవైపు తిప్పుకుంటున్నారు.

Updated Date - May 09 , 2024 | 04:20 PM