Share News

Hyderabad: గ్రేటర్‌లో ఏపీ ఎన్నికల హీట్‌..! నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:08 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల(Andhra Pradesh Elections) వేడి మహానగరంలో అధికంగా ఉంది. ఎవరి నోట విన్నా ఏపీ ఎన్నికల గురించే చర్చ..! ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం హైదరాబాద్‌(Hyderabad)లో ఉపాధి పొందుతున్న వారి ఓట్లపై గురిపెట్టారు.

Hyderabad: గ్రేటర్‌లో ఏపీ ఎన్నికల హీట్‌..! నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు

- ఫంక్షన్‌ హాల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లలో నిర్వహణ

- అభ్యర్థుల తరఫున రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు

- చార్జీలు చెల్లిస్తాం ఓటేసేందుకు రావాలని వేడుకోలు

- తమను గెలిపించాలని అభ్యర్థుల విజ్ఞప్తులు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంపీ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల(Andhra Pradesh Elections) వేడి మహానగరంలో అధికంగా ఉంది. ఎవరి నోట విన్నా ఏపీ ఎన్నికల గురించే చర్చ..! ఏపీలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు సైతం హైదరాబాద్‌(Hyderabad)లో ఉపాధి పొందుతున్న వారి ఓట్లపై గురిపెట్టారు. ఏపీలోని పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. వారిని కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు అక్కడే పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. దీనికోసం గ్రేటర్‌లో ప్రత్యేకంగా ఏపీకి చెందిన అభ్యర్థుల టీమ్‌లు రంగంలోకి దిగాయి.

ఇదికూడా చదవండి: AP Elections: అనంత జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోదరుడు రౌడీయిజం..

పసందుగా ఆత్మీయ సమావేశాలు

ఏపీలోని రాజానగరం నియోజకవర్గానికి చెందిన ఓటర్లకు గత ఆదివారం రాత్రి మియాపూర్‌లోని సత్యసాయి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన పార్టీల నేతలు హాజరై కూటమికి ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను కోరారు. ఈ సమావేశంలో పెద్దఎత్తున యువత పాల్గొనడం జనసేన అభ్యర్థికి ఎనలేని ఉత్సాహాన్నిచ్చినట్టు తెలిసింది. సమావేశం అనంతరం ఆయన అందరికీ విందు ఏర్పాటు చేసిన్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ అభ్యర్థి కూడా నగరంలో నివాసముంటున్న తన నియోజకవర్గ ఓటర్లకు ప్రముఖ హోటల్‌లో ఆదివారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రూ.4వేల విలువైన మద్యం ఫుల్‌బాటిల్‌ ను కూడా అందించినట్టు తెలిసింది. ఆదివారం నగరంలోని పలు హోటల్స్‌, కన్వెన్షన్‌ సెంటర్లు మొత్తం ఏపీ ఓటర్లతో కిటకిటలాడనున్నాయి. ఈ సందర్భంగా ఓటేసేందుకు వచ్చే ఓటర్లకు రాను, పోను బస్‌ చార్జీలు అందిస్తామని, అవసరమైతే వాహనాలు కూడా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. తమను ఓటేసి గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు.

city1.2.jpg

ఇదికూడా చదవండి: TDP: కేశినేని నానికి ఆయన కుటుంబసభ్యులే మద్దతివ్వడంలేదు: బుద్ధ వెంకన్న

గెలుపోటములు నిర్ణయించే ఓట్లు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారు పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. వారిలో చాలావరకు తమ సొంతూర్లలోనే ఓట్లున్నాయి. సుమారు 10వేల నుంచి 60వేల ఓట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. ఆ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను కూడా నిర్ణయిస్తాయి. అందుకే ఇక్కడ ఉపాధి పొందుతున్న ఏపీ ఓటర్లను గుర్తించి వారిని ఓటేసేందుకు తీసుకొచ్చే విధంగా అభ్యర్థులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేకటీమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా టీమ్‌లు నగరంలో ఉంటున్న ఓటర్లను గుర్తించి వారి మొబైల్‌ నంబర్లు సేకరిస్తున్నారు. తర్వాత ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ సందేశాల ద్వారా నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్లు, ఫంక్షన్స్‌ హాల్స్‌, వివిధ హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారమిస్తున్నారు. లోకేషన్‌ షేర్‌చేయడంతోపాటు, క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుని ఫలానా చోటుకి రావాలంటూ సూచిస్తున్నారు. వివిధ నియోజకవర్గాల వారీగా ఓటర్లతో వచ్చే ఆదివారం సమావేశాలు నిర్వహించడానికి ఇప్పటికే పలు ఫంక్షన్‌ హాల్స్‌, హోటల్స్‌ను బుకింగ్‌ చేసుకున్నట్టు తెలిసింది.

ఇదికూడా చదవండి: YS Jagan: వైఎస్ సునీత వైద్యం.. జగన్‌కు బాగానే పనిచేసిందే..!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 28 , 2024 | 12:08 PM