విదిల్చారు..!

ABN , First Publish Date - 2022-12-02T23:52:55+05:30 IST

ఖరీఫ్‌ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. సీజన ప్రారంభం నుంచి భారీ వర్షాలు, వరద బీభత్సానికి విత్తు సమయం నుంచి పంట చేతికొచ్చే దాకా అధిక వర్షాలతో రైతులు పూర్తీగా నష్టపోయారు.

 విదిల్చారు..!

- అసలే అప్పులు... ఆపై పంటనష్టం

- పంట నష్టపరిహారంలో జిల్లా రైతులకు అన్యాయం

- వర్షాలు, వరదలతో రైతు కష్టం నీటిపాలు

- అరకొరగా పరిహారాన్ని విదిల్చిన జగన ప్రభుత్వం

- కొత్త అప్పులతో రబీకి సిద్ధమైన రైతన్న

పుట్టపర్తి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ రైతు కష్టమంతా వర్షార్పణమైంది. సీజన ప్రారంభం నుంచి భారీ వర్షాలు, వరద బీభత్సానికి విత్తు సమయం నుంచి పంట చేతికొచ్చే దాకా అధిక వర్షాలతో రైతులు పూర్తీగా నష్టపోయారు. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందని, కొంతలో కొంతైనా అప్పులు, కష్టాలూ తీరుతాయని రైతులు భావించారు. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నష్టపరిహారంపై రైతులకు ఆశచూపారు. చివరకు సీఎం జగన మోహన రెడ్డిని నమ్ముకున్న రైతులకు అరకొరగా నష్టపరిహారం విదిల్చారు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువగా ఈ ఏడాది నష్టపరిహారం చెల్లించడంపై రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

గత ఏడాది నవంబరు నుంచే రైతును వర్షం వెంటాడుతూ ఉంది. ఖరీఫ్‌ సీజనలో కూడా పంటసాగుకు పెట్టిన పెట్టుబడి వర్షార్పణంతో రైతన్నను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఈ క్రమంలో నష్టపరిహారం చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి కురిసిన వర్షాలతోపాటు జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. ఈ జల ప్రవాహానికి జిల్లాలోని పలు మండలాల్లో వేలాది ఎకరాల్లో పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడుసార్లు వర్షం చేసిన బీభత్సానికి గ్రామాల్లో ఎక్కడ చూసినా వేలాది ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు నీటిపాలయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి పంట నష్టం అంచనా ప్రతిపాదనలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకుంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే రాష్ట్రంలో సీఎం జగన మోహన రెడ్డి ప్రభుత్వం రైతును ఆదుకుంటానని చెప్పి కొండంత నష్టానికి గోరంత పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంది. పంట నష్టపోయిన వేలాది మంది రైతులు తమ ఖాతాల్లోకి పంట నష్టం పరిహారం జమ అవుతుందని భావిస్తున్నా నేటికి జమ చేయకపోవడంతో తమకు పరిహారం ఇక రానట్లేనని కొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు.

నిండా ముంచింది

ఖరీఫ్‌ ఆరంభం నుంచి ఎడతెరిపిలేకుండా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు తోడు, నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించడంతో జిల్లా వ్యాప్తంగా 90 శాతం మంది రైతులు నష్టపోయారు. ఖరీ్‌ఫలో జిల్లా వ్యాప్తంగా 2,72,343 మంది రైతులు 8.41 లక్షల ఎకరాల్లో వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వరి, మొక్కజొన్న, పత్తి, కంది, చిరుధాన్యాలను సాగు చేశారు. ఆగస్టు నుంచి జిల్లాలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వేలాది ఎకరాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఎకరా పొలంలో మొక్కజొన్న సాగుకు రైతులు రూ.22వేల దాకా ఖర్చు చేశారు. అదేవిధంగా వేరుశనగకు రూ.25 వేలు నుంచి రూ.28 వేలు, పత్తి సాగుకు రూ.30వేలు, వరిసాగుకు ఎకరాకు రూ.25 వేలుకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. అధిక వర్షాలతో పంట నాశనం కావడంతో రైతులు దిగాలుచెందారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందనుకుంటే ఆశించిన మేర పరిహారం రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల మంది రైతులు నష్టపోతే కొందరికి మాత్రమే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పంటను నష్టపోయింది 1,861 రైతులేనట!

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది పంటలను సాగు చేస్తే అందులో నష్టపోయింది కేవలం 1,861 మంది మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వర్షం, వరద బీభత్సానికి వ్యవసాయ, ఉద్యాన 1,861 రైతులకు రూ.1.43 కోట్లు పంట నష్ట పరిహారం అందించారు. జిల్లా వ్యాప్తంగా 2,72,343 మంది రైతులు 8.41 లక్షల ఎకరాల్లో సాగుచేస్తే పంట నష్ట పరిహారం మాత్రం ఇచ్చింది 1,861 రైతులకు మాత్రమే. ఖరీ్‌ఫసీజన ప్రారంభం నుంచి పంట కోత దశలో తీవ్ర వర్షం, వరదలు దెబ్బతీశాయి. హిందూపురం వ్యవసాయ డివిజనలో మొక్కజొన్న, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, పెసర, వరి, కంది, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, వరి పంటలతోపాటు ఉద్యానవన పంటలైనా టమోటా, చీనీ, అరటి, వంగ, ఉల్లి,మిర్చి, కర్బూజా పంటకు భారీ నష్టం జరిగింది. మూడు సార్లు కురిసిన వర్షాలకు వ్వవసాయశాఖ 1,660 రైతులకు రూ.1,25 కోట్లు, ఉద్యాన పంటలైనా టమోటా, చీనీ, అరటి, వంగ, ఉల్లి, మిర్చి, కర్బూజా తదితర పంటలు 207 మంది రైతులకు చెందిన రూ.118 హెక్టార్లులో రూ.1.88 కోట్లు నష్టం జరిగినట్లు ఉద్యాన శాఖ అంచన వేసి కుదించి పంపారు. ప్రభుత్వం పంట నష్టం పరిహారం కింద రైతులకు ఇచ్చిన రూ.1.43 కోట్లలో వ్యవసాయ పంటకు 1.23 కోట్లు, ఉద్యాన పంటకు రూ.20 లక్షల చొప్పున విడుదల చేశారు. ఇందులో ఉద్యాన రైతుకు నష్టం అంచన రూ.1.88 కోట్లు అయితే ఇచ్చింది మాత్రం రూ.20 లక్షలే. ఇక వ్యవసాయ పంటలు వేలాది ఎకరాల్లో నష్టం జరిగితే 33శాతంపై పంట నష్టం ఉంటేనే పరిహారం కొర్రీతో వేలాది మంది రైతులకు పంట నష్టం పరిహారానికి దూరం అయ్యారు. మడకశిర వ్యవసాయ శాఖ డివిజనలో సెప్టెంబరు మాసానికి 1,141 రైతులు, 1,037 ఎకరాల్లో వివిధ పంటలు రూ.15.34 కోట్లు మేర నష్టం అంచనా వేస్తే చివరకు పరిహారం అందే సమయానికి 204 మంది రైతులకు చెందిన 99 హెక్టార్లుకు రూ.13.90 లక్షలు మాత్రమే. ఇలా జిల్లా వ్యాప్తంగా పంట నష్టం పరిహారంలో తీవ్ర అన్యాయం జరిగినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం, వరద కారణంగా చేతికొచ్చిన పంట తీవ్రంగా దెబ్బతినగా రైతులు కష్టం నీటిపాలైంది. రబీ సాగు ప్రారంభమయ్యే నాటికి రైతు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది. పైగా రబీ సాగు కోసం మళ్లీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2022-12-02T23:52:56+05:30 IST