పోలవరం బిల్లుకు కేంద్రం చిల్లు

ABN , First Publish Date - 2022-11-18T02:59:14+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,873.49 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్రం నిరాకరించింది.

పోలవరం బిల్లుకు కేంద్రం చిల్లు

2,873 కోట్లు ఇచ్చేందుకు నిరాకరణ

ఆడిట్‌ విభాగం తప్పుబట్టడంతోనే!

రూ.20,398 కోట్ల అంచనాకే పరిమితం

అది దాటితే రీయింబర్స్‌ చేయం

తేల్చేసిన ప్రాజెక్టు అథారిటీ

ముందస్తుగా 10 వేల కోట్లడిగితే అసలుకే మోసం తెచ్చిన పీపీఏ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,873.49 కోట్లను రీయింబర్స్‌ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. పనులు శరవేగంగా సాగేందుకు వచ్చే మార్చిదాకా నిర్మాణాల వ్యయం కోసం ముందస్తుగా రూ.10,000 కోట్లు ఇవ్వాలని కోరితే.. అసలుకే మోసం తెచ్చింది. ఈ పది వేల కోట్ల అడహాక్‌ నిధుల కోసం ప్రధాని మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖలు రాశారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ గత నెల 25వ తేదీన కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను కలిసి కలసి మెమోరాండం అందజేశారు. అడిగిన 10 వేల కోట్లలో ఇప్పటికే రీయింబర్స్‌ చేయాల్సిన రూ.2,873.49 కోట్లు పోను.. మిగిలిన రూ.7,126.51 కోట్లను అందించాని అందులో కోరారు. దీనిని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతామని.. త్వరలోనే రాష్ట్రంతో సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుందని జలశక్తి శాఖ తెలిపింది. దీంతో అడ్‌హాక్‌ నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని రాష్ట్ర అధికారుల బృందం భావించింది. అయితే.. బుధవారం నాటి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశంలో రాష్ట్రం మళ్లీ రూ.10 వేల కోట్ల గురించి అడిగింది. దరిమిలా 2017లో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్ల గురించి పీపీఏ ప్రస్తావించింది. కాంపోనెంట్‌ వారీగా ఇంతకుమించి నిధులు మంజూరు చేసేది లేదని తేల్చిచెప్పింది. ఈ కారణంగానే రూ.2,873.49 కోట్ల రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు తిరస్కరించామని స్పష్టం చేసింది. అడ్‌హాక్‌ నిధుల వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖ నుంచి కేంద్ర కేబినెట్‌కు వెళ్లి ఆమోదం పొందాల్సి ఉందని తెలిపింది. తాము మాత్రం రూ.20,398.61 కోట్ల అంచనా వ్యయానికే పరిమితమవుతామని వెల్లడించింది. దీనికి తోడు రూ.2,873.61 కోట్ల వ్యయాన్నిప్రిన్సిపల్‌ ఆడిట్‌ విభాగం కూడా తప్పుబట్టింది. దీనివల్లే ఈ మొత్తాన్ని రీయింబర్స్‌ చేసేందుకు కేంద్రం నిరాకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం వ్యయం చేసిన రూ.2,873.61 కోట్లకు నీళ్లొదులుకోవాల్సిందేనా అని జల వనరుల శాఖ ఆందోళన చెందుతోంది.

నిధులివ్వకుండా పనులు చేయడమెలా?

ముందుగా నిర్దేశించిన ప్రకారం.. స్పిల్‌ చానల్‌, దిగువ, ఎగువ కాఫర్‌ డ్యాం పనులు ఈ నెల 28 నాటికి పూర్తి చేయాలి. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం వద్ద గ్యాప్‌ 1, 2 పనులు ఈ ఏడాది డిసెంబరు మూడో తేదీనాటికి పూర్తి చేయాలని పీపీఏ పేర్కొంది. నిధులివ్వకుండా ఈ పనులు ఎలా పూర్తిచేయాలని జలవనరుల శాఖ తలపట్టుకుంటోంది.

91 టీఎంసీల నిల్వకే సరి!

కాగా.. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరుకే సరిపుచ్చి .. నీటి నిల్వను కేవలం 91 టీఎంసీలతో ముగించాలన్నది జగన్‌ ప్రభుత్వ ఆలోచన అని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రానికి రాస్తున్న లేఖలు.. కోరుతున్న నిధులు దీనినే సూచిస్తున్నాయని అంటున్నారు. 41.15 కాంటూరుకే పరిమితం చేస్తారని పత్రికల్లో కథనాలు వస్తున్నా.. ప్రభుత్వం ఖండించడం లేదు. గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల కాంటూరు దాకా 194.60 టీఎంసీలను నిల్వచేస్తామని స్పష్టం చేయడం లేదు. తొలిదశ పనులు 2024 నాటికి పూర్తి చేస్తామని పదే పదే చెబుతోంది. 194.60 టీఎంసీల మేరకు భూసేకరణ సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని కేంద్రం స్పష్టం చేస్తున్నా.. చెవినిపెట్టడం లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 45 టీఎంసీలను తరలించేవారని.. ఇప్పుడు పోలవరంలో 91 టీఎంసీలు మాత్రమే నిల్వచేస్తే పట్టిసీమకు రెండింతల ప్రాజెక్టుగా మారి, పెద్దసైజు బ్యారేజీగా మాత్రమే తయారవుతుందని నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబోదని అంటున్నారు.

Updated Date - 2022-11-18T02:59:15+05:30 IST