దుస్తులు విప్పి తనిఖీ చేయడమేంటి?

ABN , First Publish Date - 2022-10-28T03:24:14+05:30 IST

విజిలెన్స్‌ అధికారులు తనిఖీల పేరుతో దుస్తులు విప్పించి అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తిరుమలలో పీస్‌రేట్‌ క్షురకులు గురువారం నిరసనకు దిగారు. తనిఖీల కోసం వచ్చి కులం పేరుతో ..

దుస్తులు విప్పి తనిఖీ చేయడమేంటి?

విజిలెన్స్‌ అధికారులు కులం పేరుతో దూషించారు

తిరుమలలో నిరసన చేపట్టిన క్షురకులు

అధికారుల హామీతో ఆందోళన విరమించి విధుల్లోకి

ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు

తిరుమల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్‌ అధికారులు తనిఖీల పేరుతో దుస్తులు విప్పించి అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ తిరుమలలో పీస్‌రేట్‌ క్షురకులు గురువారం నిరసనకు దిగారు. తనిఖీల కోసం వచ్చి కులం పేరుతో దూషించారంటూ విధులు బహిష్కరించి ప్రధాన కల్యాణకట్ట ముందు ఆందోళన చేపట్టారు. తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి నగదు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయంటూ విజిలెన్స్‌ అధికారులు గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రఽధాన కల్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పీస్‌ రేట్‌ సిబ్బంది ప్రధాన కల్యాణకట్ట ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా తలనీలాలు తీసినందుకు ఒకరికి రూ.11 తీసుకుని స్వామికి సేవచేస్తున్నామన్నారు. అయితే కార్పొరేషన్‌లో చేరలేదనే క్షక్షతో అధికారులు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తనిఖీల పేరుతో దుస్తులు విప్పించడం ఏం న్యాయమని ప్రశ్నించారు. భక్తులు గౌరవంగా ఇచ్చే పది, ఇరవై రూపాయలు తీసుకుంటున్నామే తప్ప అక్రమాలకు పాల్పడలేదన్నారు. కానీ విజిలెన్స్‌ అధికారులు తమ లాకర్లు తనిఖీ చేసి సెల్‌ఫోన్లు, గుర్తింపు కార్డు, నగదు దౌర్జన్యంగా తీసుకోవడంతో పాటు కులం పేరుతో దూషించి, దుర్భాషలాడారని ఆరోపించారు. మహిళా క్షురకులు మాట్లాడుతూ.. కొంతమంది మహిళా విజిలెన్స్‌ సిబ్బంది తమతో చీరలు, జాకెట్లు కూడా విప్పించారని వాపోయారు.

విజిలెన్స్‌ వీజీవో బాలిరెడ్డి, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో సెల్వం, పోలీసులు అక్కడికి చేరుకుని కులం పేరుతో దూషించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని వారికి హామీఇచ్చారు. కాగా..పీస్‌రేట్‌ క్షురకుల నిరసనతో తలనీలాలు సమర్పించేందుకు భక్తులు గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. క్షురకుల సమస్యలపై టీటీడీ అధికారులతో ఉద్యోగ సంఘ నాయకులు సమావేశమ య్యారు. టీటీడీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చీర్ల కిరణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. క్షురకులను కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

Updated Date - 2022-10-28T03:24:22+05:30 IST