TTD: శ్రీవారు ‘శ్రీమంతుడు‘
ABN , First Publish Date - 2022-11-05T16:34:09+05:30 IST
శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్ల వివరాలు టీటీడీ (TTD) ప్రకటించింది. 24 బ్యాంకుల్లో మొత్తం రూ.15,938 కోట్ల డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల: శ్రీవారి నగదు, బంగారం డిపాజిట్ల వివరాలు టీటీడీ (TTD) ప్రకటించింది. 24 బ్యాంకుల్లో మొత్తం రూ.15,938 కోట్ల డిపాజిట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీవారి ఆలయ మొత్తం బంగారం (gold) 10,258 కేజీలు ఉందని తెలిపారు. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా టీటీడీ పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. ఇప్పుడు 10,258. 37కి చేరిందని టీటీడీ ప్రకటించింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఏడుకొండలు ఎక్కి, తిరుమలలో శ్రీవారి దర్శనంతో అలౌకికమైన ఆనందానుభూతిని మూటకట్టుకునే భక్తులు... ఆ స్వామికి కానుకల సమర్పణలో కూడా అమితమైన ఆత్మతృప్తిని పొందుతారు. అదేం మహిమోగానీ వడ్డీకాసులవాడి ‘హుండీ’ అనునిత్యం కానుకలతో కళకళలాడుతూ ఉంటుంది. శ్రీమంతుల నుంచి సామాన్యుడిదాకా ఆ కోనేటి రాయుడికి రకరకాల కానుకలు సమర్పిస్తుంటారు. తిరుమల వెంకన్నకు నాటి ఆకాశరాజు నుంచి నేటి భక్తుల దాకా... తమ స్థాయిని బట్టి నగదు, ఆభరణాలు సమర్పించుకుంటున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా శ్రీవారి ఖజానాకు హుండీ ద్వారా నగదు, బంగారం, వెండి కానుకలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి.
17వ శతాబ్దం ముందు నుంచే...
శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించే వస్త్రంతో కూడిన గంగాళాన్ని ‘హుండీ’ అంటారు. పూర్వకాలంలో ఆలయ కైంకర్యాలు, నిర్వహణ కోసం హుండీ ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దానికి ముందు నుంచే శ్రీవారి ఆలయంలో హుండీ ఉన్నట్టు దేవస్థానం రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఆర్థికంగా బలపడేందుకు ఎన్నో మార్గాలు ఏర్పడినప్పటికీ టీటీడీ మాత్రం హుండీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. హుండీలో భక్తులు తమ స్తోమతకు తగిన విధంగా నగదు, బంగారు, వెండి, బియ్యం, వస్ర్తాలు, విలువైన పత్రాలు వంటి వాటిని కానుకలుగా వేస్తారు.