విశాఖలో ఆదిశంకరుని భారీ విగ్రహం: స్వరూపానంద

ABN , First Publish Date - 2022-11-03T19:17:58+05:30 IST

విశాఖపట్నంలో ఆదిశంకరాచార్యుల వారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.

విశాఖలో ఆదిశంకరుని భారీ విగ్రహం: స్వరూపానంద

ముక్కామల (కోనసీమ జిల్లా): సాగర నగరం విశాఖపట్నంలో ఆదిశంకరాచార్యుల వారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా శంకరుల ప్రతిమ ఉంటుందని అన్నారు. కోనసీమ జిల్లా ముక్కామలలో కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతిని స్వరూపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాములు కలిశారు. ఈ సందర్భంగా వైదిక, ఆధ్యాత్మిక, సంప్రదాయపరమైన పలు అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ వానప్రస్థంలోకి అడుగుపెడుతున్న వృద్ధ దంపతుల కోసం పురాణ, వేదాంత పరమైన ధర్మ సందేహాల నివృత్తికి ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టే ఆలోచన ఉందని విజయేంద్ర సరస్వతి దృష్టికి తీసుకొచ్చారు. 2 - 3 సంవత్సరాల నిడివితో కోర్సును రూపొందించాలని భావిస్తున్నామని తెలిపారు.

విశాఖ శారదా పీఠాధిపతుల యోచన పట్ల విజయేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. అర్చకత్వం, ఆలయ సంపద పరిరక్షణ తదితర అంశాలపై కూడా చర్చించారు. హైందవ ధర్మ పరిరక్షణకు విశాఖ శ్రీ శారదాపీఠం చేపడుతున్న కృషిని ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని విజయేంద్ర సరస్వతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం ధైర్యంగా మాట్లాడే పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామేనని పేర్కొన్నారు. గురువులు జయేంద్ర సరస్వతీ స్వామితో కలిసి అనేకసార్లు విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పీఠం నుంచి వెలువడిన అనేక వేదాంత గ్రంధాలను పరిశీలించినట్లు తెలిపారు. అమలాపురం ఎంపీ అనూరాధ, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు యతీంద్రులను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ముక్కామలలో నిర్వహించిన బ్రహ్మసత్ర మహోత్సవం ముగింపు కార్యక్రమానికి పీఠాధిపతులు హాజరయ్యారు.

Updated Date - 2022-11-03T19:20:36+05:30 IST