MLA Gorantla: బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీలేదు..
ABN , First Publish Date - 2022-12-30T12:41:07+05:30 IST
రాజమండ్రి: సీఎం జగన్ స్థానిక సంస్థలను మోసం చేశారని, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
రాజమండ్రి: సీఎం జగన్ (CM Jagan) స్థానిక సంస్థలను మోసం చేశారని, కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Choudary) విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంతకాలం దాక్కుంటారని, జగన్ పరిపాలన అంతం కాబోతోందన్నారు. మూడు లక్షల కోట్లు దోపీడీ చేశారని, 120 మంది ఎమ్మెల్యేలు జగన్‌పై అసంతృప్తిగా ఉన్నారని, ముఖ్యమంత్రి బటన్ నొక్కుడు తప్పా ప్రజలకు చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రంలో ఆరు లక్షల ఫించన్లు కట్ చేశారని గోరంట్ల ఆరోపించారు. సాక్షి పేపర్‌కు ప్రయోజనం చేకూర్చడం కోసమే బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. మూడున్నర ఏళ్ళలో ఒక్క డీఎస్సీ (DSC) కూడా లేదని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, అంతా దగా, మోసమని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి ప్రజలను మోసం చేశారన్నారు. వైసీపీ నేతలు సీఎం జగన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. హోంమంత్రి, వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇదే చివరి పాలన అని, గాల్లో వచ్చారు గాల్లోనే కొట్టుకుపోతారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈనుకొండ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చంద్రబాబు సభలు కళకళలాడుతుంటే సీఎం జగన్ సభలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. బీసీలను ముఖ్యమంత్రి మోసం చేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను మోసం చేశారని, 150 మంది సలహాదారుల్లో ఒక్క బీసీ అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. బీసీలు సీఎం జగన్‌కు పుట్టగతులు లేకుండా చేస్తారన్నారు. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.