భార్య కుటుంబం వైపే జగన్
ABN , First Publish Date - 2022-10-23T03:11:57+05:30 IST
‘‘తను వచ్చిన రాజారెడ్డి కుటుంబాన్ని గాలికి వదిలి తన భార్య భారతిరెడ్డి కుటుంబం వైపు సీఎం జగన్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులకు
అందుకే వివేకా హంతకులకు రక్షణ
పక్క రాష్ట్రంలో విచారణ అంటే సీఎం జగన్‌రెడ్డిని అభిశంసించడమే: టీడీపీ
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘తను వచ్చిన రాజారెడ్డి కుటుంబాన్ని గాలికి వదిలి తన భార్య భారతిరెడ్డి కుటుంబం వైపు సీఎం జగన్‌రెడ్డి మొగ్గు చూపుతున్నారు. అందుకే వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకులకు ఆయన రక్షణ లభిస్తోంది. వివేకా హత్య కేసులో సీబీఐ వేలెత్తి చూపిస్తున్న వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు ముఖ్యమంత్రి సతీమణికి దగ్గరి బంధువు. ఈ కేసులో ఏం జరుగుతోందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది’’ అని టీడీపీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి శనివారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘‘కడప ఎంపీ సీటు తనకో... షర్మిలకో ఇవ్వాలని వివేకా కోరినందువల్లే ఆయన హత్య జరిగిందన్న అసలు విషయాన్ని షర్మిల బయటపెట్టేశారు. ఎవరు హత్య చేశారో... ఎందుకు చేశారో జగన్‌రెడ్డికి స్పష్టంగా తెలుసు. నలుగురు వ్యక్తులు కలిసి బాత్‌రూంలో వివేకాను కిరాతకంగా చంపారని ఆ హత్య జరిగిన రోజు జగన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఇప్పుడు అదే విషయాన్ని సీబీఐ కూడా చెప్పింది. హత్య చేయించినవ్యక్తులకే జగన్‌రెడ్డి కడప ఎంపీ టికెట్టు ఇచ్చారు. దగ్గర ఉండి ప్రచారం చేసి గెలిపించారు. వాళ్ల విషయం బయటకు రాకుండా ఉద్దేశపూర్వకంగా ఈ హత్యను చంద్రబాబు, లోకేశ్‌పైకి నెట్టివేశారు. తన పత్రికలో నారాసుర రక్తచరిత్ర అని పెద్దపెద్ద కఽథనాలు రాయించారు. అసలు హంతకులను కాపాడటానికి వ్యవహారం నడిపించారు. తను సీఎం అయిన తర్వాత ఈ హత్య కేసు ముందుకు వెళ్లకుండా రకరకాల అడ్డంకులు సృష్టించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ సీబీఐని పరోక్షంగా బెదిరించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి జోలికి సీబీఐ రాకుండా చూడటానికి తన అధికారాన్నంతా ఉపయోగించారు’’ అని రవి ఆరోపించారు. వివేకా కూతురు సునీత ఈ విషయాలన్నీ సమగ్రంగా గమనించిన తర్వాతే ఈ కేసు విచారణ పక్క రాష్ట్రాలకు మార్చాలని సుప్రీం కోర్టును అభ్యర్థించారని తెలిపారు. ఈ కేసులో అప్రూవర్ దస్తగిరి మాటలతో సీఎం ప్రమేయం ఏ మేరకు ఉందో అర్థమవుతుందని అన్నారు. ‘‘‘ఆంధ్రలో ఈ కేసు విచారణ సవ్యంగా జరిగే అవకాశం లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడం సీఎం జగన్‌రెడ్డిని అభిశంసించడమే.
కోర్టు తన ప్రభుత్వ పనితీరును తప్పుబట్టిన తర్వాత ముఖ్యమంత్రి తన సీట్లో ఇంకా కొనసాగే నైతిక హక్కు ఏం ఉంటుంది? ఆయన తక్షణం తన పద వి నుంచి దిగిపోవాలి’’ అని రవి డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణను సీబీఐ సంస్థ సత్వరం పూర్తి చేసి నిందితులను బోనులో నిలబెట్టాలని, తద్వారా ఈ దేశంలో దర్యాప్తు సంస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని బీటెక్ రవి విజ్ఞప్తి చేశారు.