Ramakrishna: ఏపీ అప్పులు, చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2022-12-20T15:14:33+05:30 IST
ఏపీ అప్పులు, చెల్లింపులు తదితర వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: ఏపీ అప్పులు, చెల్లింపులు తదితర వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4 లక్షల కోట్లుగా లోక్‌సభలో ఇచ్చిన గణాంకాల్లో కేంద్ర ఆర్థిక సహాయం మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారని తెలిపారు. ఏపీలో కార్పొరేషన్ల రుణాలతో సహా అన్ని రకాల అప్పులు లెక్కగడితే దాదాపు రూ.8 లక్షల కోట్లకు పైనే ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారని అన్నారు. కార్పొరేషన్ల రుణ వివరాలను ఇవ్వాలని కాగ్ పదేపదే అడిగినప్పటికీ జగన్ సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రం చెబుతున్న లెక్కలకు వాస్తవ అప్పులకు దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా వ్యత్యాసం ఉందన్నారు. తక్షణమే ఏపీ అప్పులు పెండింగ్ బకాయిలు చెల్లింపులు తదితర వివరాలపై శ్వేత పత్రం ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.