Ramakrishna: పరాదాలు కట్టుకు తిరిగే సీఎం...పదవి పోయాక బురకా కప్పుకుపోతాడు
ABN , First Publish Date - 2022-12-27T12:01:46+05:30 IST
పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి.. పదవి నుంచి దిగిపోయాక బురకా కప్పుకుపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి.. పదవి నుంచి దిగిపోయాక బురకా కప్పుకుపోతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan Mohan Reddy) ముందస్తు ఎన్నికలు పెట్టి ముందే పోతే రాష్ట్రానికి ఇంకా మంచిదన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం అంతా కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. ఏ రూపేణా నిరసన తెలపకుండా పోలీసుల్ని కాపలా పెట్టడం పరాకాష్ట అని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే, తప్పని చెప్పక పోగా వైసీపీ నేతలు ఆ ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీకి సన్మాన వేడుకలు నిర్వహించి సమాజానికి ఏం చెప్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి పూర్తిగా లొంగిపోయిన పోలీసులు వ్యవస్థ పరువు తీస్తున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు.