బైకులపై మృతదేహాల తరలింపు
ABN , First Publish Date - 2022-11-08T05:13:42+05:30 IST
స్నేహితుడితో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. పోలీసులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. మరుసటి ఉదయం సముద్రం వెంబడి
మచిలీపట్నం బీచ్‌లో బాలుడు గల్లంతు
మరుసటి రోజు తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం
బైకుపై తరలించిన మేనమామ
తెలంగాణలో కూతురి శవంతో
బైక్‌పై 60 కిలోమీటర్లు!!
ఖమ్మం ఆస్పత్రిలో పాప మృతి
అడిగినా అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది
పేద ఆదివాసీల దీనగాథ
ఆలస్యంగా సమాచారం ఇచ్చారంటున్న పోలీసులు
మచిలీపట్నం, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడితో కలసి సముద్ర స్నానానికి వెళ్లిన 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. పోలీసులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. మరుసటి ఉదయం సముద్రం వెంబడి బంధువులు గాలించగా మృతదేహం లభ్యమైంది. దిక్కుతోచని పరిస్థితిలో ఆ బాలుడి మేనమామ, మరో యువకుడు బైకుపైనే మృతదేహాన్ని తరలించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర ఈ విషాదకర సంఘటన జరిగింది. మచిలీపట్నం గొడుగుపేటకు చెందిన గోళ్ల నవీన్‌కుమార్ (14) ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం మంగినపూడి బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి కొట్టుకుపోయాడు. సోమవారం ఉదయం నవీన్‌కుమార్ మేనమామ బాలకృష్ణ, మరో ఇద్దరు బీచ్‌కు వచ్చారు. అక్కడున్న మత్స్యకారులు... సముద్రంలో గల్లంతైన వారి మృతదేహాలు పెదపట్నం గ్రామ సమీపంలోకి కొట్టుకువస్తున్నాయని చెప్పారు. దీంతో వారు సముద్రం వెంబడి గాలించారు. పెదపట్నం గ్రామం సమీపంలో నవీన్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. బాలకృష్ణ మరో యువకుడి సాయంతో మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై మచిలీపట్నం తరలించే ప్రయత్నం చేశాడు. మంగినపూడి వద్ద ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ వారిని ఆపి పోలీస్ అధికారులకు, మృతుడి బంధువులకు సమాచారం తెలిపారు.
ఈ బాలుడి కుటుంబసభ్యులు టాటాఏస్ వాహనాన్ని సమకూర్చుకుని మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాలుడి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. అధికారులు వాహనాన్ని సమకూర్చలేదని విమర్శిస్తూ కొందరు పోస్టింగ్‌లు పెట్టారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం లేదని బందరు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. నవీన్‌కుమార్ చనిపోవడంతో బాధలో ఉన్న వారి బంధువులు పోలీసులకు విషయాన్ని ఆలస్యంగా తెలియజేశారన్నారు. కావాలని కొందరు సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేశారని డీఎస్పీ తెలిపారు.
తెలంగాణలో కూతురి శవంతో
ఖమ్మం ఆస్పత్రిలో పాప మృతి
అడిగినా అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది
పేద ఆదివాసీల దీనగాథ
ఆలస్యంగా సమాచారం ఇచ్చారంటున్న పోలీసులు
ఖమ్మం, ఏన్కూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆ బిడ్డ ఇక లేదని వైద్యులు చెప్పినప్పుడు ఆ నిరుపేద ఆదివాసీ దంపతుల్లో గుండెలు మెలిపెట్టేసేంత బాధ! దాన్నంతా దిగమింగుకొని.. చేతిలో 50 రూపాయలు మాత్రమే మిగిలిన స్థితిలో మృతదేహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆస్పత్రికి నుంచి బయటకొచ్చి 90 కి.మీ దూరంలో ఉన్న ఇంటికి తరలించేందుకు ఆ బడుగు జీవులు పడ్డ కష్టం తెలిస్తే మనసున్న వారెవరికైనా కళ్లు చెమర్చక మానవు! అంబులెన్స్ లేదని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది చెప్పడం.. ప్రైవేటు వాహనానికి రూ3వేలు ఇచ్చుకునే స్థోమత లేకపోవడం.. విషయాన్ని బంధువులకు చేరవేద్దామన్నా ఫోను లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బైక్‌పై మృతదేహాన్ని తరలించాలనుకున్నారు. పాప బాబాయి బైక్ తోలుతుంటే తల్లిదండ్రులు వెనుక కూర్చుని మధ్యలో మృతదేహాన్ని పెట్టుకున్నారు. అలా 60 కిలోమీటర్లు ప్రయాణించి ఊరు చేరుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వెట్టి మల్లయ్-ఆది దంపతులు ఇరవై ఏళ్ల క్రితం ఛత్తీ్‌సగఢ్ నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లికి వచ్చి కాయకష్టం చేసుకొని బతుకుతున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మూడేళ్ల కూతురు సుక్కికి జ్వరం ఆపై ఫిట్స్ రావడంతో శనివారం సాయంత్రం మల్లయ్ దంపతులు బైక్‌పై ఎక్కించుకొని ఏన్కూరు సర్కారు దవాఖానాకు తెచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని.. ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో దగ్గరున్న రూ.200తో బస్సెక్కారు. రాత్రి ఏడింటికి ఖమ్మం ఆస్పత్రికి చేరుకున్నారు. పాపను పరిశీలించి అక్కడి వైద్యులూ పెదవి విరిచారు. చిన్నారిని వరంగల్ లేదంటే హైదరాబాద్‌కు తరలించాల్సి ఉంటుందని చెబుతూనే వైద్యం ప్రారంభించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే సుక్కి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. కన్నీరుమున్నీరైన ఆ తల్లిదండ్రులు, తమ కూతురి మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు ఆస్పత్రి సిబ్బందిని సంప్రదించగా వారు అంబులెన్స్ అందుబాటులో లేదని చెప్పారు. ప్రైవేటు అంబులెన్సు వారిని సంప్రదిస్తే రూ3వేలు అడిగారు. అంత డబ్బు లేకపోవడంతో మల్లాయ్ ఓ నిర్ణయానికొచ్చాడు. పాప మృతదేహాన్ని భార్య చేతుల్లోంచి తీసుకొని బస్సెక్కి గార్ల ఒడ్డు వరకు చేరుకున్నాడు. అక్కడ జయరాం అనే బాలవెలుగు ఉపాధ్యాయుడి ద్వారా తమ గ్రామపెద్ద అయిన గంరగాజుకు ఫోన్ చేయించి విషయం తెలిపాడు. గంగరాజు వెంటనే మల్లయ్ సోదరుడికి ఓ బైక్ ఇచ్చి పంపగా అతడు ఖమ్మానికి వెళ్లి వదిన ఆదిని వెంటబెట్టుకొచ్చాడు. గార్ల నుంచి బైక్‌పై ముగ్గురూ మృతదేహాన్ని వెంటబెట్టుకొని 60 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయం 11:30 గంటలకు కొత్తమేడేపల్లి చేరుకున్నారు. అంత్యక్రియలకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రామస్థులే ఇంటికింటికి రూ.100 చొప్పున చందాలు వేసుకొని జరిపించారు. కాగా మృతదేహాలను తరలించేందుకు ‘పార్థివ వాహనాల’ సౌకర్యం ఉన్నా ఆదివాసీ కుటుంబానికి ఉపయోగపడకపోవడంపై ఖమ్మంజిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావును వివరణ కోరగా ఆయన మరోరకంగా స్పందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేప్పుడు తమకు చెప్పలేదని, సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే పార్థివ వాహనం ఏర్పాటు చేసేవాళ్లమని పేర్కొన్నారు.