TDP : ఇదేం ఖర్మరా!
ABN , First Publish Date - 2022-11-08T04:53:04+05:30 IST
‘కరెంటు చార్జీల బాదుడుతో షాక్ కొడుతున్న బిల్లులు... ఇసుక రేటు విపరీతంగా పెరిగి ఇళ్లు కట్టుకొనేవారు గగ్గోలు... ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు
ప్రజల బాధలపై టీడీపీ కొత్త కార్యక్రమం
మూడు నెలలపాటు అన్ని నివాస ప్రాంతాల్లో సమావేశాలు
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయం
ఈ నెలలోనే శ్రీకారం చుట్టే చాన్స్
ముఖ్యమైన సమస్యలపై అక్కడికక్కడే వినతిపత్రాలు సిద్ధం
బాధితుల సంతకాలతో అధికారులకు అందజేత
రచ్చబండకు రెడీ
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘కరెంటు చార్జీల బాదుడుతో షాక్ కొడుతున్న బిల్లులు... ఇసుక రేటు విపరీతంగా పెరిగి ఇళ్లు కట్టుకొనేవారు గగ్గోలు... ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు ఆరు నెలలైనా రావడం లేదని రైతుల నిరసన... మూడేళ్ల నుంచి టీఏ డబ్బులు నిలిచిపోయాయని కానిస్టేబుళ్ల అసంతృప్తి... తొమ్మిది నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్ధానం ప్రాంతంలోని కిడ్నీ డయాలసిస్ కేంద్రాల్లో విధులకు హాజరు కాని టెక్నీషియన్లు’... ఇలాంటి పలు రకాల సమస్యలపై ప్రజలు తమ వాణిని వినిపించడానికి తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేస్తోంది. ‘ఏం ఖర్మరా...’ పేరుతో రాష్ట్రంలోని ప్రతి నివాస ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. అనేక అంశాల్లో ప్రజల్లోని పలు వర్గాల్లో వైసీపీ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, నిరసన గూడు కట్టుకొని ఉన్నాయని, వాటిని వారు వెళ్లగక్కడానికి ఒక కార్యక్రమం చేపట్టాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
దీనికి తాత్కాలికంగా పై పేరు అనుకొన్నారు. ఈ నెలలోనే దీనిని ప్రారంభించాలని అనుకొంటున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని గత ఎనిమిది నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై పెరిగిన భారాలు, పన్నుల మోతను ఆ కార్యక్రమాల్లో ఎత్తిచూపింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్షకుపైగా భారం పడిందని గణాంకాలు, ఉదాహరణలతో కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంచింది. అధికార పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమానికి పోటీగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఉత్సాహంగా నిర్వహించారు. మరింత ఉత్సాహంతో మరేదైనా కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తే బాగుంటుందని పార్టీ వర్గాల నుంచి అధినాయకత్వానికి సూచనలు రావడంతో ‘ఏం ఖర్మరా’ పేరిట రచ్చబండల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు.
బాధలు వినిపించే వేదిక..: గడప గడపకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ప్రజలను తమ సమస్యలు చెప్పుకోనివ్వడం లేదని, బెదిరిస్తున్నారని అనేక చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వారు తమ బాధలు చెప్పుకోడానికి ఒక వేదికను ఇస్తే బాగుంటుందని టీడీపీ అధినాయకత్వం యోచిస్తోంది. ప్రతి నివాస ప్రాంతంలో రచ్చ బండ తరహాలో ఒక సమావేశం నిర్వహించి అక్కడ వివిధ వర్గాల ప్రజలు తమ గోడును వినిపించే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం పేరు ప్రస్తుతానికి ‘ఏం ఖర్మరా బాబూ’ అని పెట్టారు. ఇంకా ఏదైనా మంచి పేరు ప్రతిపాదనకు వస్తే మార్చే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైన అవస్థలు, తలెత్తిన కష్టాలు, ఎడతెగకుండా కొనసాగుతున్న సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తేవాలని టీడీపీ నాయకత్వం ఆశిస్తోంది. ముఖ్యమైన సమస్యలపై అక్కడికక్కడే వినతిపత్రాలు తయారు చేసి వాటిపై బాధితుల సంతకాలు కూడా చేయించి సంబంధిత అధికారులకు సమర్పించాలని నిర్ణయించారు.
ప్రజల్లో ఎక్కువగా వినిపిస్తున్న సమస్యలు ఈ కార్యక్రమం ద్వారా గుర్తించి వాటిపై పోరాటానికి నడుం బిగించాలని కూడా అనుకొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా మార్చే నిమిత్తం కొన్ని అంశాలపై ప్రదర్శన బోర్డులు తయారు చేయించి ప్రతి నివాస ప్రాంతంలో ప్రదర్శించాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలు, దాడులు, అక్రమ తవ్వకాలు, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలపై ప్రదర్శన బోర్డులు తయారు చేయించాలని అనుకొంటున్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఇన్‌చార్జి మూడు నెలల వ్యవధిలో తమ నియోజకవర్గం పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నది నిర్ణయం. ఈ కార్యక్రమం సందర్భంగా పార్టీ ముఖ్యులంతా మూడు నెలలపాటు ప్రజల్లోనే ఉండాలని ఆదేశించనున్నారు.