Byreddy Perni Kittu Meeting: ఈ సీక్రెట్ మీటింగ్ గురించి జగన్‌కు తెలుసో.. లేదో..!
ABN , First Publish Date - 2022-10-26T21:13:29+05:30 IST
శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy), బందరు ఎమ్మెల్యే (Bandar MLA) పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు (Perni Kittu) బందరు మండలం తపసిపూడి గ్రామంలోని సరుగుడుతోటల్లో బుధవారం రహస్య సమావేశం..
మచిలీపట్నం: శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Siddharth Reddy), బందరు ఎమ్మెల్యే (Bandar MLA) పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు (Perni Kittu) బందరు మండలం తపసిపూడి గ్రామంలోని సరుగుడుతోటల్లో బుధవారం రహస్య సమావేశం నిర్వహించారు. విజయవాడలో (Vijayawada) మంత్రి జోగి రమేష్‌ను(Minister Jogi Ramesh) కలిసి మాట్లాడిన బైరెడ్డి అనంతరం మచిలీపట్నం(Machilipatnam) వెళ్లారు. తపసిపూడి గ్రామం సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు కూతవేటు దూరంలో సరుగుడుతోటలో చుట్టూ పరదాలు కట్టి, తివాచీలు పరచి, రౌండ్ టేబుళ్లు వేసి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థ రెడ్డితో వెళ్లినవారు, పేర్ని కిట్టు అనుచరులు నలుగురైదుగురు మాత్రమే ఈ సమావేశం జరిగే ప్రాంతంలో ఉన్నారు. వేరెవరినీ ఆ ప్రాంతానికి అనుమతించలేదు. ఏదైనా హోటల్ గదిలో లేదా పేర్ని కిట్టు ఇంటి వద్దనో కాకుండా తపసిపూడి వద్ద సరుగుడు తోటలో వీరిద్దరూ రహస్యంగా సమావేశం కావడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతోంది. తపసిపూడి, మంగినపూడి పంచాయతీలు పక్కపక్కనే ఉంటాయి.
రెండు పంచాయతీలకు చెందిన వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు కనీస సమాచారం ఇవ్వకుండా వీరిద్దరూ సమావేశం కావడం వెనుక ఆంతర్యం ఏంటో అని వైసీపీ నాయకులే చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు ఇటీవల కాలంలో రాజకీయంగా పావులు కదుపుతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో పేర్ని కిట్టు నియోజకవర్గంలో ఇంటింటికీ వెళుతున్న విషయం జగన్‌కు తెలిసింది. దీంతో.. ఎమ్మెల్యే హోదాలో మీరే పాల్గొనాలని పేర్ని నానికి ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నిలబెట్టే అభ్యర్థుల్లో వారసులకు నో ఛాన్స్ అని ఇప్పటికే ఆ పార్టీ నేతలకు జగన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ బందరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో పేర్ని కిట్టునే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బైరెడ్డి, పేర్ని కిట్టు రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ధర్ గెలుపు కోసం వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గత ఎన్నికల్లో శాయశక్తులా కృషి చేశారు. అయితే.. ఎమ్మెల్యేగా ఆర్ధర్ గెలిచిన కొన్నాళ్లకే సిద్ధార్థరెడ్డికి, ఆర్థర్‌కు విభేదాలొచ్చాయి. దీంతో.. వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి కర్నూలు జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఈ ఇద్దరు యువ నేతల రహస్య భేటీపై రాజకీయంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.