శ్రీశైలం ఘాట్‌రోడ్డులో పెద్దపులి
ABN , First Publish Date - 2022-11-05T05:36:25+05:30 IST
ప్రకాశం జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డు తుమ్మలబయలు-చింతల మధ్యలో పెద్దపులి శుక్రవారం ఉదయం సందడి చేసింది.
ప్రకాశం జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్‌రోడ్డు తుమ్మలబయలు-చింతల మధ్యలో పెద్దపులి శుక్రవారం ఉదయం సందడి చేసింది. అటువైపు వెళుతున్న వారు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. శ్రీశైలం-నాగార్జున సాగర్ రిజర్వు ఫారెస్టులో పెద్దపులి ఘాట్ రోడ్డు దాటుతూ అటువైపు వెళ్లే భక్తులకు, ప్రజలకు తారసపడింది. కార్తీకమాసం కావడంతో భక్తులు అధికసంఖ్యలో స్వామి దర్శనానికి వెళుతున్నారు. ఆ సమయంలో మూలమలుపులో నెమ్మదిగా నడిచి వెళుతున్న పెద్దపులి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా వాహనాలను ఆపేశారు. ఆ శబ్దాలకు పులి ఒక్క గెంతుతో రోడ్డును దాటేసింది. కాగా పులి కనిపించిన విషయం అటవీ శాఖాధికారులకు కూడా తెలిసింది. రేంజి అధికారి విశ్వేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ పెద్దపులి పాదముద్రలు గుర్తించారు.
- పెద్ద దోర్నాల