ప్రధాని సభ నుంచి ఇంటికి వెళ్తూ.. గుండెనొప్పితో విలవిల్లాడిన మహిళ
ABN , First Publish Date - 2022-11-12T19:41:42+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) మైదానంలో శనివారం నిర్వహించిన ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళ గుండెనొప్పితో విలవిల్లాడింది.
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) మైదానంలో శనివారం నిర్వహించిన ప్రధాని సభలో పాల్గొనేందుకు వచ్చిన ఒక మహిళ గుండెనొప్పితో విలవిల్లాడింది. ఆమెను 108లో కేజీహెచ్‌కు తరలించారు. ప్రధాని సభకు నగరంతోపాటు ఉత్తరాంధ్ర (Uttarandhra) జిల్లాల నుంచి వేలాది మందిని తరలివచ్చారు. గాజువాక నియోజకవర్గ పరిధిలోని కాపు జగ్గరాజుపేట ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ (45) కూడా సభలో పాల్గొనేందకు వచ్చింది. సభ పూర్తయిన తరువాత ఇంటికి వెళుతున్న సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీజీ వసతి గృహం వద్ద ఛాతీలో నొప్పి వస్తోందంటూ కూలబడిపోయింది.
ఆమెతోపాటు వచ్చిన మహిళలు పక్కనే వున్న హాస్టల్ గదిలో కూర్చోబెట్టి సపర్యలు చేశారు. అయినా, నొప్పి తగ్గకపోవడంతో దగ్గర్లోని వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు గ్యాస్ట్రిక్ (Gastric) సమస్యగా భావించి పాంటాప్ ఇచ్చారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో 108కు సమాచారం అందించారు. అయితే అంబులెన్స్ 45 నిమిషాలు తరువాత గానీ రాలేదు. అందులో ఆమెను కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. బీపీ, షుగర్ ఎక్కువగా ఉందని, మిగిలిన పరీక్షలు చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.