ఏమి, ఎందుకు నడవాలి ఆయనతో..?
ABN , First Publish Date - 2022-10-29T02:15:04+05:30 IST
దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వచ్చిందనే భావన బలంగా పెరుగుతూ ఉంది.
దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు వచ్చిందనే భావన బలంగా పెరుగుతూ ఉంది. దీనికి కారణంగా రాజకీయ నియంతృత్వం స్పష్టంగా కనిపించినప్పటికీ, నిగూఢంగా ఉన్న సామాజిక, ఆర్థిక నియంతృత్వమే దానిని సృష్టించిందన్న అవగాహన అవసరం. ప్రజాస్వామ్య రాజ్య ఫలాలను అనుభవించి ఎదిగిన పౌర సమాజానికి, లేదా మధ్యతరగతికి ప్రజాస్వామ్య విలువల పట్ల ఆచరణలో లోతైన నిబద్ధత లేకపోవడమే ఈనాటి దుస్థితికి కారణం.
పౌర జాతీయవాదం అనే భావనను 1909 నాటికే గాంధీ ప్రతిపాదించారు. నాటికే పొడ చూపుతున్న మూడు ఆలోచనా ధోరణులకు స్పందనగా ఆయన ఈ ప్రతిపాదన చేశారు. హింస ద్వారా జాతి విముక్తి సాధించాలని ఆలోచిస్తున్న శ్యామాజీ కృష్ణవర్మ, వి.డి. సావర్కర్‌ల ఆలోచన ధోరణి ఒకటి. మార్క్సిస్టు పద్ధతిలో ఆలోచిస్తున్న వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఆలోచనా ధోరణి రెండవది. ఇక మత ప్రాతిపదికన దేశాన్ని నిర్వచిస్తున్న ముస్లిం జాతీయవాదుల ధోరణి మూడవది. ఈ మూడు ఆలోచనా ధోరణులకు స్పందనగా గాంధీ చేసిన ప్రతిపాదన పౌర జాతీయవాదం. ఇరవయ్యో శతాబ్దంలో సామాజిక ప్రజాస్వామ్య భావనకు అతిపెద్ద ప్రతినిధి అంబేడ్కర్. ఆర్థిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేని రాజకీయ స్వేచ్ఛ మనుషుల్ని మానవీయంగా ఏమీ మలచదు అని గాంధీ స్పష్టం చేశారు. వలస వాదానికి వ్యతిరేకంగా మొదలైన రాజకీయ పోరాటంలో భాగంగా మాత్రమే సామాజిక సమస్యల గురించి మాట్లాడితే చాలదని, పౌర జాతీయవాదం, పౌర ప్రజాస్వామ్యం లేదా సామాజిక ప్రజాస్వామ్యం వాటికవే విలువైన సామాజిక మార్పులని గాంధీ వాదన. కానీ అది అంబేడ్కర్ రూపంలో తప్ప విస్తృత రూపంలో గుర్తింప బడలేదు. అంబేద్కర్ పోరాటం ప్రభావం మాత్రం రాజ్యాంగ సృష్టికర్తల మీద బలంగా పడింది. అందుకే కులాలుగా, మతాలుగా విడిపోయి ఉన్న చోట మొదటిసారిగా ‘ప్రజలు’ అనే ఒక గుర్తింపును రాజ్యాంగం ఇవ్వడానికి ప్రయత్నించింది. అది జాతిగా రూపుదిద్దుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన రాజ్యాంగ కర్తలు భారతీయ సమాజాన్ని ఒక నాగరికతగా కూడా గుర్తించారు. ఆ నాగరికతలో ఎన్నో అప్రజాస్వామిక లక్షణాలు, చారిత్రక అన్యాయాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే దేశం ఒక జాతి రాజ్యంగానే మిగలకుండా, అంతిమంగా అది సామాజిక ప్రజాస్వామ్యం సాధించే దిశగా ప్రయాణించాలని కోరుకున్నారు. సమూహాల మధ్య శాంతి, సామరస్యం, సమానత్వం అనే లక్ష్యమే భారతీయ సామాజిక పరిస్థితులకు అనుగుణమైన రాజ్యాంగ లక్ష్యంగా రాజ్యాంగకర్తలు భావించారు. ఎందుకంటే రాజ్యాంగం పేరు మీద సృష్టించబడే రాజ్యం అనివార్యంగా ప్రజాస్వామిక రాజ్యమే కానక్కరలేదనే అవగాహన అప్పటికే ఐరోపా చరిత్ర వాళ్లకు నేర్పింది.
కులాల సమస్యలు, హిందూ ముస్లిం అనైక్యత, పేదరికం, మురికివాడల సమస్యలు పట్టించుకోకుండా స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడుపుతున్న మధ్యతరగతి వర్గం వలస స్వభావాన్ని మొదటి నుంచీ ఎత్తి చూపుతూనే వచ్చారు గాంధీ. అగ్రవర్ణాల నుంచి వచ్చిన ఉద్యోగ వర్గం, న్యాయవాదులు, ఆధునికతకు ప్రతినిధులుగా చెలామణి అవుతున్న వైద్యులు లేకుండా వలసవాదం తాత్వికంగా, రాజకీయంగా దేశంలో నిలదొక్కుకునే అవకాశమే లేదని ఆయన నిశ్చితాభిప్రాయం. హిందూ సమాజాన్ని సంస్కరించకుండా, వలసవాదం పోకడలను పోగొట్టుకోకుండా వచ్చే స్వాతంత్రం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే అవకాశం లేదని ఆయన ఆందోళన. పరిమిత రాజకీయ లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెసు తీరుతో విసిగిపోయిన గాంధీ ఆ పార్టీకి దూరంగా ఉండడానికి ప్రయత్నించారు. ఆయన కార్యాచరణను అన్యమనస్కంగానే కాంగ్రెస్ నాయకులు పాటించారు. కాంగ్రెస్ నాయకులకు ఉండిన అవగాహనా పరిమితి, మినహాయింపుల పట్ల గాంధీకి స్పష్టమైన అవగాహన ఉండింది. ఆయన దక్షిణ ఆఫ్రికా నుంచి దేశంలో అడుపెట్టేవరకు క్షేత్రస్థాయిలో కాళ్ళకు మట్టి అంటకుండా స్వాతంత్ర్యోద్యమం నడిపిన కాంగ్రెస్ ఆ తర్వాత గ్రామాల బాట, పట్టణాల బాట పట్టాల్సి వచ్చింది.
అయినా, 1947 తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో పాలన చాలా కేంద్రీకృతంగా సాగింది. ‘రాజకీయ సమస్య’ స్వాతంత్య్రం రావడంతోనే పరిష్కారమై పోయింది, మిగిలింది ఆర్థిక సమస్య ఒక్కటే అనే ధోరణిలో పాలన ప్రారంభం అయ్యింది. ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా సమాజాన్ని తయారు చేయాలి, రాజ్యమే ఈ మార్పుకు ఇరుసు అనే అవగాహనను నెహ్రూ నాయకత్వం స్థిరపరుస్తూ వచ్చింది. కాంగ్రెస్ వెన్నంటే ఉన్న అగ్రకులాల నుంచి వచ్చిన కొత్త మధ్య తరగతి వర్గం ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రణాళికా సంఘంలో, కొత్తగా వచ్చిన విద్యా, సాంస్కృతిక సంస్థలలో చేరి మొత్తం సమాజాన్ని ఆధునికత వైపు– అంటే ప్రజాస్వామ్యం వైపు (ఇవి రెండూ వేరు అనే విషయం ఇప్పటికి గాని మనకు బోధపడలేదు, అది వేరే విషయం)– మళ్లించే బృహత్తర బాధ్యతను రాజ్యమే నిర్వహిస్తుందని సూత్రీకరించారు. సామాజిక పురోగతి, పారిశ్రామికీకరణ, ప్రణాళికబద్ధ అభివృద్ధి లాంటి భావజాలం ఊతంగా ఆర్థిక వ్యవస్థను, భూసంస్కరణలను, నేర న్యాయ వ్యవస్థను శాసించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజలకు రాజకీయాలు అవసరం లేదు, పంచాయతీల వరకు అధికార వికేంద్రీకరణ అవసరం లేదు, అభివృద్ధి రాజ్యం (Developmental State) ఒక్కటి మాత్రమే చాలు అనే విశ్వాసాన్ని ప్రచారం చేశారు. అప్పుడే తయారవుతున్న మధ్యతరగతిలోని చురుకైన మేధో వర్గం ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా ప్రభుత్వంలో భాగమైపోయింది.
సమాజం స్వభావాన్ని నిర్దేశించడంలో రాజ్యం పాత్ర గణనీయంగా ఉంటుందనడంలో సందేహం అక్కరలేదు కానీ, అది అనివార్యంగా ప్రజాస్వామ్యాన్ని సృష్టిస్తుందని నమ్మడానికి మనం 19 శతాబ్దంలో లేము. నాజీ కాన్సంట్రేషన్ క్యాంపు నుండి బతికి బట్టకట్టిన హన్నా ఆరెండ్ట్ లాంటి మేధావులు ప్రజాస్వామ్యం చాలా విలువైనది, దాన్ని పెంపొందించే బాధ్యతను రాజ్యం మీద ఉంచి పౌర సమాజం మిన్నకుంటే దాని గతి అధోగతే అని 1960లలో హెచ్చరించారు. అదేవిధంగా పరమత సహనం, క్షమ లాంటి నైతిక విలువలను పెంపొందించే శక్తి సామర్థ్యాలు రాజ్యాలకు లేవని, పోటీతత్వాన్ని పెంచే మార్కెట్, ఎన్నికలు దీర్ఘకాలంలో ఇతరుల పట్ల సహనాన్ని ధ్వంసం చేస్తాయని 1980 నుండి సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మధ్య తరగతి స్వప్రయోజనం, పాలకవర్గ నీతి అలాంటి హెచ్చరికలను ఖాతరు చేసేంత చిన్నవి కావు.
దేశాభివృద్ధి పేరు మీద అధికారం చెలాయించిన మధ్యతరగతి 1990లో సరళీకరణ మొదలవ్వగానే ప్లేటు ఫిరాయించింది. దాని దృష్టిలో ఇప్పుడు ప్రభుత్వ రంగమంటే అసమర్థత, అవినీతి. చదువంటే మార్కెట్ సమాజాన్ని నడపడానికి నైపుణ్యం ఉన్న మెకానిక్కులు తయారు చేయడం. ప్రైవేటు రంగమంటే వృత్తి నిబద్ధత, నిజాయితీ, సమర్థత. రాజకీయమంటే జాతీయత. సంస్కృతి అంటే గుళ్ళు గోపురాలు. శత్రువు అంటే పరమతస్థుడు. ప్రజాస్వామ్యం అంటే సామాన్యుల చేత ఎలాగైనా ఓట్లు వేయించడం. ఆర్థిక అభివృద్ధి అంటే జీడీపీ పెరుగుదల. హక్కులంటే ఆస్తులు కాపాడుకోవడానికి కోర్టులకు పోవడం. జీవితంలో విజయం సాధించడం అంటే ఎలాగైనా డబ్బు సంపాదించడం. అప్పుల పాలైతే ఆత్మహత్య చేసుకోవడం. సామాజిక చర్చ అంటే జూమ్ సమావేశాలు. సమాజం కోసం పనిచేయడం అంటే పదవీ విరమణ తర్వాత అపార్ట్మెంట్ అసోసియేషన్‌కు నాయకత్వం వహించడం. ప్రజాస్వామ్యం అంటే మార్కెట్ ఇచ్చిన హక్కులను రాజ్యం కాపాడడం అనే అర్థం చెప్పుకున్నంత కాలం ఇలాంటి మధ్య తరగతే తయారవుతుంది.
సత్యం పట్ల నిబద్ధతతో, న్యాయాన్యాయాలు కొలమానంగా, పరిణామాలకు వెరవక నైతిక స్థైర్యంతో సామూహికంగా జీవించే, వ్యవస్థను నిరంతరం ప్రశ్నించే సత్యాగ్రహులను గురించి పలవరించాడు గాంధీ. ఆయన్ను చంపిన నాడే ఆ రాజకీయ ఆయుధం పట్ల ప్రజలకు నమ్మకం చచ్చిపోయింది. సామాజిక జీవితంలో ప్రజాస్వామ్యం పాలు పెంచడాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియకు దోహదం చేయడాన్ని ఒక బాధ్యతగా మధ్యతరగతి ఎన్నడైనా స్వీకరించిందా? ఆ సామాజిక చైతన్యాన్ని ప్రజలలో కల్పించడానికి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రయత్నించాయా? ఇప్పుడు సామాన్యులలో మతతత్వం కోరలు చాచిందని ఏడవడం ఎందుకు?
1990 నుండి 2014 వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా మధ్య తరగతిలో వచ్చిన సామాజిక, రాజకీయ మార్పుకు కాంగ్రెస్ నాయకత్వం వహించింది. వాటితో అంటకాగిన అన్ని రాజకీయార్థిక శక్తులు ప్రస్తుత వికారమైన మార్పులకు దోహదం చేశాయి. ఈ అసామాజిక నెగడును మరింతగా మండించడం, కాష్టం ఆరిపోకుండా చూడడమే 2014 నుండి జరుగుతున్నది. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత సామాజిక ఐక్యత ధ్వంసం అవుతూ ఉందని రాహుల్ గాంధీ కాలిబాట పడితే, పౌర సమాజం, మేధావులు ఆయన వెంట నడవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ప్రజాస్వామ్యానికి మరింత ప్రమాదం కలిగిందంటే దానికి కారణం కాంగ్రెస్ పెంచి పోషించిన విషపు మొక్క మాను కావడమే. ప్రజాస్వామ్యానికి తక్కువ ప్రమాదకారులే నూతన ప్రజాస్వామ్యవాదులు అనే నిర్వచనం ఇచ్చుకుంటే తప్ప, ఇంత కాలం పౌర ప్రజాస్వామ్యం కొరకు ఏమీ కృషి చేయలేదనే అపరాధభావం ఉంటే తప్ప ఆయన వెంట తిరగాల్సిన అవసరం లేదు. పౌర ప్రజాస్వామ్యం అత్యవసరంగా అడ్డదారిలో వచ్చేది కాదు. దానికి మనుషులలో దీర్ఘకాలిక నిజాయితీ, నిబద్ధత, కార్యాచరణ, సత్యం కోసం నిలబడే నీతి, నిర్భీతి అవసరం. ఈ విలువలన్నీ వర్తమాన సామాజిక నీతికి విరుద్ధం.
మురళి కర్ణం