Exam special: తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులు
ABN , First Publish Date - 2022-12-26T16:01:32+05:30 IST
భారత్ వ్యవసాయాధారిత దేశం (India is an agricultural country). వ్యవసాయానికి సరిపడా నీటి లభ్యత ఉండాలి. మనదేశంలో వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపై
టీఎస్‌పీఎస్సీ(TSPSC) / పోలీసు పరీక్షల ప్రత్యేకం
భారత్ వ్యవసాయాధారిత దేశం (India is an agricultural country). వ్యవసాయానికి సరిపడా నీటి లభ్యత ఉండాలి. మనదేశంలో వ్యవసాయం ప్రధానంగా రుతుపవనాలపై ఆధారపడి ఉంది. అంతేకాకుండా శీతోష్ణస్థితిపరంగా భారత్... ఉష్ణమండల దేశం కావడం వల్ల కృత్రిమ పద్ధతుల ద్వారా వివిధ పంటలకు నీటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునే ప్రధాన ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వివిధ నదులపై ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. తెలంగాణ రాష్ట్రం(Telangana State)లోనూ గోదావరి(Godavari), కృష్ణాతోపాటు ఇతర ప్రధాన నదులపై బహుళార్థక ప్రాజెక్టులను నిర్మించారు.
ప్రాజెక్టుల డిమాండ్ ఏరియా(ఆయకట్టు ప్రాంతం విస్తీర్ణం) ఆధారంగా నీటి పారుదల ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించారు. అవి..
1. భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
2. మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
3. చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు
భారీ తరహా నీటి ప్రాజెక్టులు: 10,000 హెక్టార్లు(25,000 ఎకరాలు) అంతకంటే ఎక్కువ భూమికి సాగునీరు అందించే ప్రాజెక్టులను భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000 - 10,000 హెక్టార్లు లేదా 5,000-25,000 ఎకరాల భూమికి నీటి సౌకర్యాన్ని అందించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు: 2,000 హెక్టార్లు లేదా 5,000 ఎకరాల వరకు నీటి పారుదల సౌకర్యాన్ని కల్పించగలిగే ప్రాజెక్టులను చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులు అంటారు.
ఏడో నిజాం పాలనలో నీటి పారుదల సౌకర్యాలు
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణాంతరం 1911లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానం పాలన బాధ్యతలు చేపట్టారు. చెరువులను పునరుద్ధరించడానికి సర్వే జరిపించాలని 1921-22లో నిజాం ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రెండు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక సర్వే బృందం గోదావరి, దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతంలో... మరో బృందం కృష్ణానది, దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతంలో సర్వే చేపట్టాయి. ఈ బృందాలిచ్చిన నివేదికల ఆధారంగా నిజాం ప్రభుత్వం 984 చెరువులకు 65,48,346 ఉస్మానియా సిక్కాలను మంజూరు చేసింది. 1923-25లో నిజాం ప్రభుత్వ డెవల్‌పమెంట్ బోర్డు పాత చెరువులు, కుంటలు, బావులకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించి వర్షపు నీటిని, నదీజలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావించింది. అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించింది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తెలంగాణలో, హైదరాబాద్ సంస్థానంలోని ఇతర ప్రాంతాల్లో అతివృష్టి, అనావృష్టి సమస్యలకు పరిష్కారం బావులు, చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణమేనని భావించాడు. నీటిపారుదల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.
తిండి లేక, తాగు, సాగు నీటికి నోచుకోక ప్రజలు పడుతున్న బాధలు, పెరుగుతున్న ఆహారధాన్యాల ధరలు నిజాంను ఆందోళనకు గురిచేశాయి. నీటిపారుదల వసతిని పెంచడమే వీటికి తగిన పరిష్కారమని మీర్ ఉస్మాన్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. స్పష్టమైన నీటిపారుదల విధానాన్ని రూపొందించారు. దీని పర్యవసానంగానే 1922-24 మధ్యకాలంలో వేలాది చెరువులు, కుంటలు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు, డజనుకుపైగా భారీ నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టారు. వాటి వివరాలు...
పోచారం ప్రాజెక్టు
ఏడో నిజాం పాలనలో నిర్మించిన మొదటి మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు
దీన్ని నిజాం ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట మండలం పోచారం గ్రామం వద్ద అల్లేరు వాగుపై 1922లో రూ.22.11 లక్షల వ్యయంతో నిర్మించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 42 గ్రామాల్లో 10,500 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. పోచారం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు పంటలు కలిపి సుమారు 17 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. పోచారం ప్రాజెక్టు పనులను 1915లో ప్రారంభించారు. 13 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో రూ.32 లక్షల అంచనా వ్యయంతో దీన్ని ప్రారంభించారు.
నిజాం సాగర్
గోదావరి ఉపనది అయిన మంజీరాపై భారీ ప్రాజెక్టును నిర్మించాలని నిజాం ప్రభుత్వం సంకల్పించింది.
1916లో అప్పటి పబ్లిక్ వర్క్స్ శాఖ ప్రభుత్వ కార్యదర్శి, ప్రముఖ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయడానికి సర్వే ప్రారంభించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ పనులను పోచారం ప్రాజెక్టుకు ఇన్‌చార్జిగా పనిచేస్తున్న సీసీ పాల్‌కు అప్పగించారు. 1918 నవాబ్ అలీ నవాజ్ జంగ్‌ను నిజాం ప్రభుత్వం చీఫ్ ఇంజనీర్‌గా నియమించింది.
సీసీ పాల్ మంజీరా నదిపై బీదర్ జిల్లాలో రెండు స్థలాలను, నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డికి పశ్చిమ దిశలో 7 మైళ్ల దూరంలో మరో స్థలాన్ని ఎంపిక చేశారు.
చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ 1920 జూన్‌లో ఎల్లారెడ్డి సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. సీసీపాల్ ఎంపిక చేసిన స్థలానికి 1.5 మైళ్ల ఎగువన మాల్‌దొడ్డి గ్రామం వద్ద డ్యాం నిర్మిస్తే ముంపు తక్కువగా ఉంటుందని నవాజ్ జంగ్ భావించాడు. ఆ స్థలంలో మంజీరా నది రెండు పాయలుగా చీలి ఒక మైలు దిగువన మళ్లీ కలుస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణ ఇన్వెస్టిగేషన్‌కు నిజాం రాజు 1922 జూలై 26న అనుమతించారు.
నిజామాబాద్ జిల్లాలో 377 గ్రామాల్లోని 2,75,000 ఎకరాలకు సాగునీరందించాలని నిజాం సంకల్పించారు.
ఇన్వెస్టిగేషన్ నివేదిక అందిన తరవాత 1923 ఆగస్టు 30న 3 కోట్ల 5 లక్షల ఉస్మానియా సిక్కాల అంచనా వ్యయంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. 8-10 ఏళ్ల కాలంలో ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించింది.
1931లో దీని నిర్మాణం పూర్తయింది. సవరించిన అంచనాల ప్రకారం దీని వ్యయం 4,26,79,000 ఉస్మానియా సిక్కాలు.
1933లో కాల్వలకు నీరు విడుదలైంది. నిజాంసాగర్ కాల్వల ద్వారా 452 పెద్ద, చిన్న చెరువులకు, కుంటలకు కూడా నీరందించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన కాల్వను 62 మైళ్ల పొడవున(డిచ్‌పల్లి వరకు) నిర్మించారు.
నిజాం సాగర్ కన్నా ముందు నిర్మించిన మైసూర్‌లోని కృష్ణరాజ సాగర్ ప్రాజెక్టు, మద్రా్‌సలోని కావేరీ - మెట్టూరు ప్రాజెక్టు, బొంబాయిలోని నీరా డెవల్‌పమెంట్ ప్రాజెక్టుల వ్యయం కన్నా నిజాంసాగర్ ప్రాజెక్టు ఖర్చు తక్కువ. నిజాంసాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 29.14 టీఎంసీలు కాగా నీటి వినియోగ సామర్థ్యం 58 టీఎంసీలు 2,60,000 ఎకరాల మొదటి(ఆబి/ఖరీ్‌ఫ)పంట; 40,000 ఎకరాల రెండో(తాబి/రబీ) పంట; 20,000 ఎకరాల చెరకు పంటకు సాగు నీరందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. 400 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించారు.
నిజాం పాలనలో సాగునీటి రంగం
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు, చోడురాజుల కాలం నుంచి గొలుసు కట్టు చెరువులను నిర్మించారు. ఒక పద్ధతి ప్రకారం నీటి పారుదల సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ, పరిపాలన సంస్కరణలను ప్రవేశపెట్టిన సాలార్‌జంగ్..1868లో స్పష్టమైన నీటిపారుదల విధానాన్ని రూపొందించి ‘ఇరిగేషన్ బోర్డు’ను ఏర్పాటు చేశారు. పబ్లిక్ వర్క్స్(ప్రజా పనుల) శాఖలో భాగంగానే ఈ బోర్డు ఉండేది. అంతకుముందు ఒక స్పష్టమైన నీటి పారుదల విధానం లేదు. తాలూక్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు చెరువులు, కుంటల నిర్వహణను చూసేవారు. వీటి నిర్వహణ కోసం నిజాం ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా సుమారు రెండు లక్షల రూపాయలు కేటాయించేది. మారుమూల ప్రాంతాల్లోని చెరువుల పర్యవేక్షణ అధికారులకు సాధ్యమయ్యేది కాదు. నిజాం సంస్థానంలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటిని సాగుకు వినియోగించాలనే ప్రణాళికలు 1870 పూర్వం నిజాం ప్రభుత్వానికి లేవు. బ్రిటిష్ మిలిటరీ ఇంజనీర్ ఆర్థర్ కాటన్ హైదరాబాద్ సంస్థానం సరిహద్దులో గోదావరి నదిపై ఇచ్చంపల్లి వద్ద 1858లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే ఇంజనీర్లు ప్రాణాంతక వ్యాధులతో మరణించడంతో ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది.
-వి.వెంకట్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ