TSPSC Exam special: బ్రిటిష్ కాలంలో స్థానిక సంస్థలు
ABN , First Publish Date - 2022-12-26T16:11:53+05:30 IST
స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని చదివేటప్పుడు అభ్యర్థులు 73, 74 రాజ్యాంగ సవరణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) స్థానిక ప్రభుత్వాల పరిణామక్రమాన్ని
స్థానిక ప్రభుత్వాలు
స్థానిక ప్రభుత్వాలు అనే అంశాన్ని చదివేటప్పుడు అభ్యర్థులు 73, 74 రాజ్యాంగ సవరణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) స్థానిక ప్రభుత్వాల పరిణామక్రమాన్ని కూడా పరిగణనలోని తీసుకుని అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది. సూక్ష్మదృష్టితో పరిశీలించినట్లయితే స్థానిక ప్రభుత్వాలను కింది విధంగా విభజించుకోవచ్చు.
1. బ్రిటిష్ కాలంలో స్థానిక ప్రభుత్వాలు
2. స్వాతంత్రోద్యమ కాలంలో స్థానిక ప్రభుత్వాలు
3. 73, 74 రాజ్యాంగ సవరణలు
భారతదేశం(India)లో ప్రాచీన కాలం నుంచే స్థానిక ప్రభుత్వాలకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. రుగ్వేదంలో ‘సభ’, ‘సమితి’ అనే రెండు స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి పేర్కొన్నారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో స్థానిక పాలన గురించి, ‘గ్రామిక’, ‘గ్రామకూట’ అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావన ఉంది. గ్రామాధికారిని ‘గ్రామిణి’ అని, 10 గ్రామాలకు అధిపతిని ‘దశగ్రామిణి’ అని పిలిచేవారు. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన మొదటి రాజవంశం చోళులు. మొదటి పరాంతకుని ఉత్తర మెరూరు శాసనం ద్వారా చోళులు తాటి ఆకులను బ్యాలట్ పత్రాలుగాను, కుండలను బ్యాలట్ బాక్సులుగాను ఉపయోగించి స్థానిక సంస్థలకు పాలకులను ఎన్నుకునే వారని తెలుస్తున్నది. పట్టణ, స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన మొదటి రాజవంశం ‘మౌర్యులు’. మౌర్యుల పరిపాలనలో పాటలీపుత్ర నగరంలోని పట్టణ స్థానిక ప్రభుత్వం గురించి మెగస్తనీస్ తన ‘ఇండికా’ గ్రంథంలో వివరించాడు. మెగలుల పరిపాలన కాలంలో పట్టణ పాలనను ‘కొత్వాల్’ అనే అధికారి చూసుకునేవాడు. ‘కొత్వాల్’కు సహాయంగా ‘మున్సబ్’ అనే అధికారి ఉండేవాడు.
బ్రిటిష్ కాలం(British period)లో స్థానిక సంస్థలు
ఆధునిక భారతదేశ చరిత్రలో 1687లో ‘మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్’ ఏర్పాటుతో స్థానిక పాలన ప్రారంభమైంది.
ఈస్టిండియా కంపెనీ వారు జిల్లాను యూనిట్‌గా తీసుకుని 1772లో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టారు.
1793 చార్టర్ చట్టం ద్వారా మద్రాసు, కలకత్తా, బొంబై పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధత కల్పించారు.
1813 చార్టర్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని కల్పించారు.
1835-36లో భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన మెట్‌కాఫ్ భారత గ్రామీణ సమాజాలను ‘లిటిల్ రిపబ్లిక్స్’గా అభివర్ణించారు.
1870లో ‘లార్డ్ మేయో’ చేసిన తీర్మానం ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన తొలి తీర్మానంగా చెప్పవచ్చు.
1882 మే 18న వికేంద్రీకరణలో భాగంగా ‘రిప్పన్’ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి మరొక తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో భాగంగానే ‘రిప్పన్’ ప్రస్తుత మూడంచెల విధానాన్ని పోలిన వ్యవస్థను ప్రతిపాదించారు. అందుకే రిప్పన్‌ను ‘స్థానిక ప్రభుత్వాల పితామహుడు’ అని పిలుస్తారు.
1907లో స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి సూచనలు చేయాలని బ్రిటిష్ ప్రభుత్వం ‘రాయల్ కమిషన్’ను ఏర్పాటు చేసింది.
1909లో చేసిన ‘మింటో మార్లే’ చట్టం స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
1919లో చేసిన ‘మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్’ చట్టం స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర జాబితాలో చేర్చాలని సూచించింది. (స్థానిక ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాల్లో చేర్చారు).
1935లో చేసిన ‘భారత ప్రభుత్వ చట్టం’ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారు.
-వి.చైతన్య దేవ్
పోటీ పరీక్షల నిపుణులు