Mulki movement: సిటీ కాలేజ్ ఘటనలు.. Group-1 ప్రత్యేకం
ABN , First Publish Date - 2022-12-26T15:37:53+05:30 IST
భారతదేశం (India)లో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడి ప్రజలకు తమదైన సంస్కృతి, అస్థిత్వం ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంగా రాజకీయ
తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం
గ్రూప్-1 మెయిన్స్ ప్రత్యేకం
భారతదేశం (India)లో తెలంగాణ (Telangana) రాష్ట్రానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇక్కడి ప్రజలకు తమదైన సంస్కృతి, అస్థిత్వం ఉన్నప్పటికీ ఒకే ప్రాంతంగా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు. సుదీర్ఘకాలం ఆస్‌ఫజాహీల పాలన కింద మరాఠ, కన్నడ భాషల ప్రజలతో కలిసి ఉన్నారు. తెలుగు(Telugu) స్థానంలో పర్షియన్, ఉర్దూ(Urdu)ని అధికార భాషలుగా అంగీకరింపజేసిన రాజకీయ ఆధిపత్యాన్ని సహించే స్థితికి చేరుకున్నారు. అయినప్పటికీ తమ భాష, యాస, సంస్కృతి, సామాజిక అస్థిత్వం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలది.
తెలంగాణ అస్థిత్వ పోరాటానికి ప్రధాన భూమిక ముల్కీ ఉద్యమం. భారత యూనియన్‌లో చేరి ప్రత్యేక ఉనికిని సాధించుకునే వరకూ ఈ పోరాటం కొనసాగింది. ఈ నేపథ్యంలోనే 1950వ దశకంలో ఎగిసిన ముల్కీ ఉద్యమ(Mulki movement) ప్రత్యేకతను పోటీ పరీక్షల కోసం సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అవగతం చేసుకోవాలి.
ముల్కీ ఉద్యమం ఆవిర్భావానికి కారణాలు
1948-52 మధ్య జయంత్‌నాథ్ చౌధురి మిలిటరీ ప్రభుత్వం, వెల్లోడి పౌర ప్రభుత్వాలు ఆంధ్రప్రాంత(మద్రాస్) అధికారులను హైదరాబాద్ రాష్ట్రానికి ఆహ్వానించాయి.
వీరిని తిరిగి ఆంధ్రపాంతానికి పంపే ప్రయత్నాన్ని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం చేయలేదు.
రాష్ట్ర సచివాలయంలో ఇంగ్లీష్ భాషా నిపుణుల పేరుతో మద్రాస్ ఆంధ్ర అధికారులకు మాత్రమే అవకాశం కల్పించారు.
మాతృభాష బోధన పేరుతో ఆంధ్ర ఉపాధ్యాయులను హైదరాబాద్ రాష్ట్రంలో నియమించారు
మద్రాస్ ఆంధ్ర అధికారులు ఆధిపత్య ధోరణితో స్థానికులను చులకనగా చూడటం.
వీరి వైఖరికి వ్యతిరేకంగా బూర్గుల ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం
ప్రత్యక్ష కారణాలు
1952 జూన్, జూలై మాసాల్లో హైదరాబాద్ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరిగి నూతన యువనాయకత్వం ఆవిర్భవించడం
అధికారులు ముల్కీ సర్టిఫికెట్లను విచ్చల విడిగా మంజూరు చేయడం
1952 జూలై 26న వరంగల్ నగరంలో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించడం
1948లో అబ్దు గఫార్ నాయకత్వంలో ‘హైదరాబాద్ సర్కారీ ‘ములాజిం యూనియన్’ సభ్యుల్లో ఐక్యత ఏర్పడటం
1952 ఆగస్టులో రామాచారి అనే శాసన సభ్యుడు ‘తెలంగాణ హితరక్షణ సమితి’ని స్థాపించడం
ఆగస్టు 27, 28 తేదీల్లో విద్యార్థులు పిలుపున్చిన బంద్ కార్యక్రమంపై ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగించడం
వరంగల్‌లో అయ్యదేవర కాళేశ్వరరావు ఎగతాళిగా ప్రసంగించడం
హన్మకొండలో మర్కజీ స్కూల్ హెడ్‌మాస్టర్ హరున్ ఉల్ రషీద్‌కు అవమానం జరగడం
సిటీ కాలేజ్ సంఘటన
1952 సెప్టెంబరు 3న సిటీ కాలేజ్‌లో గైర్ ముల్కీలను వెనుకకు పంపే ఆందోళనను విద్యార్థులు ఉధృతం చేశారు. ఉరేగింపు అఫ్జల్‌గంజ్ నుంచి మదీనా చేరేసరికి విద్యార్థుల సంఖ్య కొన్ని వేలకు చేరింది. దాంతో ఎటువంటి హెచ్చరికలు లేకుండానే శివకుమార్ లాల్ అనే పోలీస్ అధికారి ఆధ్వర్యంలో విద్యార్థులపై 44 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లు వదంతులు వచ్చాయి. కానీ, వెంటనే నలుగురు చనిపోగా, తరవాత మరో నలుగురు మృతి చెందారు. దీంతో విద్యార్థులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా 16 గంటలు కర్ఫ్యూ విధించారు. తెలంగాణ ఉద్యమకాలంలో విధించిన తొలి కర్ఫ్యూ ఇది. సెప్టెంబరు 6న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కారును శ్రీ కృష్ణ ఆంధ్రా భాషా నిలయం ఎదుట ఆందోళనకారులు దగ్ధం చేశారు. ఈ సంఘటనలపై ప్రభుత్వం రెండు విచారణ కమిటీలను నియమించింది. ఒకటి కె.వి.రంగారెడ్డి, మెల్కోటే, పూల్‌చంద్ గాంధీ, నవాజ్ యార్ జంగ్‌లతో కూడిన మంత్రి వర్గ ఉపసంఘం కాగా, రెండోది సిట్టింగ్ జడ్జి కమిటీ. దీనికి జస్టిస్ పింగళి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం వహించారు.
సంఘటన - అనంతర పరిణామాలు
ఈ కాల్పులను ప్రజాస్వామ్యవాదులు ఖండించారు. దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రామానందతీర్థ ఈ ఆందోళన వెనుక ‘ఆజాద్ హైదరాబాద్’ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. వీరి ఆరోపణలను వ్యతిరేకిస్తూ పీడీఎఫ్ నాయకుడు దేశ్‌పాండే, హైదరాబాద్ కామ్రేడ్స్ అసోసియేషన్ నాయకుడు డాక్టర్ రాజ్‌బహదూర్ గౌర్, మరో ప్రతిపక్ష నేత వై.కె.భాగే ఈ ఆందోళన వెనుక 70 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని వివరించారు. ముల్కీ నిబంధనలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబరు 13న ‘అవామ్’ పత్రిక ఎడిటర్ అఖ్తర్ హుస్సేన్(ఎమ్‌ఎల్‌ఏ), మరో జర్నలిస్టు బేగం సాజదా జహాన్‌ను ప్రభుత్వం పీడీ(ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ కింద అరెస్టు చేసింది. ఉద్యమంలో తొలి పీడీ చట్టం ఇది. ఈ సంఘటనలపై భారత ప్రధాని నెహ్రూ స్పందించారు. 1952 సెప్టెంబరు 26న హైదరాబాద్ నగరానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసు కాల్పుల వెనుక విశాలాంధ్ర సామ్రాజ్యవాద శక్తుల ప్రభావం ఉందని 1952 అక్టోబరు 16న ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వ్యాఖ్యానించారు.
జస్టిస్ పింగళి జగన్‌మోహన్‌రెడ్డి కమిటీ(Justice Pingali Jagan Mohan Reddy Committee) నివేదిక (1952 సెప్టెంబరు 7 - 1952 డిసెంబరు28)
1952 సెప్టెంబరు 9న కమిటీ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. సెప్టెంబరు 10న విచారణ ఆరంభించింది. డిసెంబరు 28న నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు...
హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగానికి, రాష్ట్ర క్యాబినేట్‌కు మధ్య సమన్వయం లేదు
పోలీస్ అధికారులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అదుపు చేయలేకపోతోంది.
విద్యార్థులను ముల్కీ ఉద్యమ నాయకులు తీవ్రస్థాయిలో రెచ్చగొట్టారు. అవసరం లేకున్నా పోలీస్ కాల్పులు జరిపించారు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం, పోలీసులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థుల తల్లిదండ్రులు సమన్వయంతో వ్వవహరించాలి. కాగా, జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం రాసిన తన ఆత్మకథ ‘ద జ్యుడీషియరీ, ఐ సర్వ్‌డ్’ అనే పుస్తకంలో...ఈ ఆందోళనలు న్యాయసమ్మతమని, అధికారులు అతిగా ప్రవర్తించారని, వారి వెనుక విశాలాంధ్ర శక్తులు ఉన్నాయని రాశారు. అయితే మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు.
జస్టిస్ జగన్‌మోహన్ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం రాసిన తన ఆత్మకథ ‘ద జ్యుడీషియరీ, ఐ సర్వ్‌డ్’ అనే పుస్తకంలో...ఈ ఆందోళనలు న్యాయసమ్మతమని, అధికారులు అతిగా ప్రవర్తించారని, వారి వెనుక విశాలాంధ్ర శక్తులు ఉన్నాయని రాశారు.
ఆధునిక కాలంలో తెలంగాణ అస్థిత్వం కోసం ఉద్యమాలు
ఈ ఉద్యమాల్లో చెప్పుకోదగినది గ్రంథాలయ ఉద్యమం. ఆంధ్రమహాసభ కల్పించిన చైతన్యం తెలంగాణ ప్రజల్లో ఒక అస్థిత్వ తపనను ప్రోత్సహించింది. తొలితరం నాయకత్వం తెలంగాణ అస్థిత్వం కోసం, ప్రత్యేకత కోసం కృషి చేసింది. వీరి కృషే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరంపై ప్రాథమికంగా పునాదులు వేసింది. హైదరాబాద్ సిటీ కాలేజ్ సంఘటన, వరంగల్ కేంద్రంగా కొనసాగిన విద్యార్థి పోరాటాలు, ప్రజల మద్దతు తెలంగాణ ప్రజల స్వీయ పరిపాలన ఆకాంక్షలకు నిదర్శనాలు. వాస్తవానికి ఏ వ్యవస్థలోనైనా రాజరికం కన్నా ప్రజాస్వామ్యమే ప్రజల భాగస్వామ్యానికి ప్రతిబింబంగా ఉంటుంది. హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ రాష్ట్రంగా మారిన తరవాత కూడా వ్యవస్థను నడిపే ప్రభుత్వ ఉద్యోగుల్లో తెలంగాణ ప్రాంతీయుల భాగస్వామ్యం సరైన నిష్పత్తిలో లేకపోవడం వల్ల ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేసింది. ఈ అంశాల ఆధారంగానే తెలంగాణ ఉద్యమం అంటే ఉద్యోగాల కోసం జరిగిన ఉద్యమమని, దీనికి నిజమైన నాయకులు ప్రజలేనని గ్రహించాలి. టీఎ్‌సపీఎస్సీ/పోలీసు పరీక్షల కోసం సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు తెలంగాణ ఉద్యమ సహజ స్వభావాన్ని, ప్రధానంగా ముల్కీ ఉద్యమ ఆవిర్భావ మూల కారణాలను గ్రహించాలి. గ్రూప్-1 స్థాయిలో సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు ఈ పరిస్థితులను స్వీయ విశ్లేషణ చేసుకోగలగాలి. దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సొంత నోట్స్ రాసుకోవాలి. తార్కిక జ్ఞానమే అభ్యర్థుల విశ్లేషణకు భూమికను నిర్మించగలుగుతుంది.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్ డైరెక్టర్,
5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్