CBA Exams: ప్రైమరీలో ఇదేం పరీక్ష..!

ABN , First Publish Date - 2022-10-31T12:41:40+05:30 IST

చదవస్తే ఉన్న మతి పోయిందో లేదో గానీ, ప్రస్తుతం చదువుకున్నా, పరీక్షలు రాసినా మతిపోయేలా ఉంది. విద్యాశాఖ తెచ్చిన కొత్త పరీక్షా విధానం గందరగోళంగా ఉండటం, నిర్దిష్ట ప్రాతిపదిక లేకపోవడం కారణంగా నవంబరు 2 నుంచి జరిగే సీబీఏ పరీక్షలు పిల్లలకు

CBA Exams: ప్రైమరీలో ఇదేం పరీక్ష..!
ఇదేం పరీక్ష..!

నవంబరు 2 నుంచి 5 వరకు సీబీఏ పరీక్షలు

అన్ని సబ్జెక్టులకూ ఒకటే ఓఎమ్మార్‌ షీట్‌ అంట..

1, 2 తరగతులకు టీచర్లే జవాబులు రాయాలట..

4 వరకూ టీచర్లే ప్రశ్నలు చదివి వినిపించాలట..

కొత్త విధానంపై విమర్శల వెల్లువ

చదవస్తే ఉన్న మతి పోయిందో లేదో గానీ, ప్రస్తుతం చదువుకున్నా, పరీక్షలు రాసినా మతిపోయేలా ఉంది. విద్యాశాఖ తెచ్చిన కొత్త పరీక్షా విధానం గందరగోళంగా ఉండటం, నిర్దిష్ట ప్రాతిపదిక లేకపోవడం కారణంగా నవంబరు 2 నుంచి జరిగే సీబీఏ పరీక్షలు పిల్లలకు ఏమాత్రం మంచి చేస్తాయోనని ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : నవంబరు 2 నుంచి 5వ తేదీ వరకు 1-10వ తరగతి వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏటా దసరా సెలవులకు ముందే సమ్మెటివ్‌-1 పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది 1-8వ తరగతి వరకు పరీక్షల విధానంలో మార్పులు చేయడంతో నవంబరులో పరీక్షలు నిర్వహించేందుకు టైమ్‌టేబుల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి 1-8వ తరగతి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేస్తూ పరీక్షలు నిర్వహించనున్నారు. తరగతి గది ఆధారిత మూల్యాంకనం-1 (సీబీఏ, క్లాస్‌రూమ్‌ బేస్‌డ్‌ ఎసెస్‌మెంట్‌-1) పద్ధతిలో ఓఎమ్మార్‌ షీట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. 9, 10 తరగతులకు పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు పరీక్ష ఇక్కడే మొదలైంది.

అన్ని సబ్జెక్టులకూ ఒకటే

ఓఎమ్మార్‌ షీట్లను విద్యార్థులకు ఇచ్చి జవాబులను బబుల్‌ చేయాలని విద్యాశాఖ సూచిస్తోంది. ప్రశ్నాపత్రాలతో పాటు ఓఎమ్మార్‌ షీటును విద్యార్థులకు ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్‌ షీట్‌ ఉంటుంది, ఒక్కో సబ్జెక్టుకు 20 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఒక్కో సబ్జెక్టులో 15 మార్కులకు బిట్లు ఉంటాయి. ప్రశ్నలకు ఓఎమ్మార్‌ షీట్‌లో జవాబులను దిద్దాల్సి ఉంటుంది. మరో ఐదు మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటికి వేరుగా జవాబులు రాసి ఇవ్వాలి. పరీక్ష రాశాక సంబంధిత ఓఎమ్మార్‌ షీట్‌ను ఉపాధ్యాయుడికి అప్పగించాలి. తరువాత రోజు మరో సబ్జెక్టుకు పరీక్ష జరిగితే అందుకు సంబంధించి కాలమ్‌లో రెండో సబ్జెక్టుకు సంబంధించిన జవాబులను ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ప్రశ్నల ఆధారంగా సరైన జవాబులను బబుల్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రశ్నలు టీచర్లే చదివి వినిపించాలి

ఓఎమ్మార్‌ షీట్ల ద్వారా 1-8వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించే విధానంపై ఎస్‌ఈఆర్టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి యూట్యూబ్‌ లింక్‌ ద్వారా శనివారం టీచర్లకు అవగాహన నిర్వహించారు. 1, 2 తరగతులకు సంబంధించి పరీక్ష పత్రంలోని అన్ని ప్రశ్నలను టీచర్లు చదివి వినిపించాలని సూచించారు. 3వ తరగతికి సంబంధించి నాలుగు ప్రశ్నలు చదివి వినిపించాలని, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రం నుంచి ఒక ప్రశ్నను చదివి వినిపించాలని సూచించారు. విద్యార్థులకు ఇచ్చే ఓఎమ్మార్‌ షీట్‌లో విద్యార్థికి సంబంధించి ఐడీ నెంబరు ముద్రించి ఉంటుందని, ఒకరోజు ముందే విద్యార్థులకు ఐడీ నెంబర్లను తెలియజేయాలని చెప్పారు. ముందే ఐడీ నెంబరు చెబితే ఓఎమ్మార్‌ షీట్‌లో తమ నెంబర్లను సరిచూసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. పరీక్ష ప్రారంభించే ముందు ఓఎమ్మార్‌ షీట్‌లలో జవాబులు ఎలా దిద్దాలనే అంశంపై బ్లాక్‌బోర్డుపై టీచర్లు డెమో చేసి చూపాలని సూచించారు. ఓఎమ్మార్‌ షీట్‌లో జవాబులు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్నుతో దిద్దాల్సి ఉంటుందన్నారు. ఓఎమ్మార్‌ షీట్‌ పాడైతే బఫర్‌ ఓఎమ్మార్‌ షీట్‌ను వాడాలని, విద్యార్థి వివరాలను మాన్యువల్‌గా రాయాలని పేర్కొన్నారు.

1, 2 తరగతుల ఓఎమ్మార్‌ షీట్లు టీచర్లే రాయాలి

1, 2 తరగతులకు సంబంధించి విద్యార్థులకు ఇచ్చే ఓఎమ్మార్‌ షీట్‌లో టీచర్లే జవాబులను బబుల్‌ చేయాలి. ఓఎమ్మార్‌ షీట్‌లో ఏదైనా ప్రశ్నకు విద్యార్థి జవాబు దిద్దకపోతే సంబంధిత ప్రశ్నను ఈ-ఆప్షన్‌లో టీచర్లు బబుల్‌ చేయాలని సూచించారు. పరీక్ష పూర్తయ్యాక జవాబులకు సంబంధించిన కీ విడుదల చేయాలన్నారు.

Updated Date - 2022-10-31T12:52:12+05:30 IST