Tamilisai: నా తపనంతా అందుకోసమే..! భేటీలో ప్రస్తావన!

ABN , First Publish Date - 2022-11-11T11:42:55+05:30 IST

విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీ(Universities Vacancies Filling )లో యూజీసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌(Governor Tamilisai) స్పష్టం చేశారు. ఖాళీలను వీలైనంత త్వరగా.. పూర్తి పారదర్శకతతో, నిష్పాక్షికంగా భర్తీ చేయాలని, అర్హతల

Tamilisai: నా తపనంతా అందుకోసమే..! భేటీలో ప్రస్తావన!
నా తపనంతా..

యూజీసీ నిబంధనలు పాటించాల్సిందే

వర్సిటీ నియామకాల్లో పారదర్శకత ఉండాలి..

వీలైనంత త్వరగా ఖాళీలను భర్తీ చేయాలి

విశ్వవిద్యాలయాల బాగు కోసమే నా తపన..

విద్యాశాఖ మంత్రి సబితతో గవర్నర్‌ తమిళిసై

తమ ఉద్దేశం కూడా అదేనని వివరించిన మంత్రి..

45 నిమిషాల పాటు జరిగిన భేటీ

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విశ్వవిద్యాలయాల్లోని ఖాళీల భర్తీ(Universities Vacancies Filling )లో యూజీసీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌(Governor Tamilisai) స్పష్టం చేశారు. ఖాళీలను వీలైనంత త్వరగా.. పూర్తి పారదర్శకతతో, నిష్పాక్షికంగా భర్తీ చేయాలని, అర్హతల ఆధారంగా నియామకాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Education Minister Sabitha Indra Reddy)కి సూచించారు. యూనివర్సిటీల నియామక బోర్డు(Universities Recruitment Board) బిల్లుపై గవర్నర్‌ వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేయడం కోసం మంత్రి సబిత గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి వెంట రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌ తదితరులు ఉన్నారు.

వర్సిటీల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బోర్డుకు అధికారాలను కల్పించడం కోసం యూనివర్సిటీల సవరణ బిల్లును తీసుకువచ్చారు. అసెంబ్లీలో ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. అయితే.. ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించలేదు. దీనిపై కొన్ని సందేహాలు ఉన్నాయని, వాటిని విద్యా శాఖ మంత్రి నివృత్తి చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశం రాజకీయ ప్రాధాన్యాన్నిసంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే.. మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులతో సహా గవర్నర్‌ను కలిసి, ఆమె సందేహలను నివృత్తి చేశారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన వీరి భేటీలో.. గవర్నర్‌ పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే తాను ఈ బిల్లుపై వివరణ అడుగుతున్నట్టు గవర్నర్‌ స్పష్టం చేశారు. నియామకాల్లో యూజీసీ నిబంధనలను పాటించాలనడంతోపాటు.. విశ్వవిద్యాలయాల్లోని హాస్టల్‌, లేబొరేటరీ, లైబ్రరీ సౌకర్యాలను, డిజిటల్‌ వనరులను, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.

సందేహాలు.. సమాధానాలు..

భేటీ సందర్భంగా ఈ బిల్లుపై గవర్నర్‌ కొన్ని సందేహాలను వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా.. గతం లో ఉన్న పద్ధతి ప్రకారం నియామకాలను చేపట్టవచ్చు కదా? కమిటీల ద్వారా చేయడానికి అభ్యంతరమేమిటీ? కొత్తగా బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు? తాజా నిర్ణ యం ద్వారా వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినదా? యూజీసీ మార్గదర్శకాల ను పాటించారా? తదితర ప్రశ్నలను గవర్నర్‌ అడిగిన ట్టు సమాచారం. దీనికి మంత్రి.. గత విధానంలో కొన్ని లోపాలున్నాయని.. వాటిని అధిగమించడానికే బోర్డును తీసుకొచ్చామని చెప్పినట్టు తెలుస్తోంది. యూజీసీ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే వర్సిటీలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా బోర్డు ద్వారా నియామకాలను చేపట్టనున్నట్టు గవర్నర్‌కు వివరించారు. అలాగే.. అన్ని వర్సిటీలకు ఉమ్మడిగా నియామకాలను చేపడితే రిజర్వేషన్లు దెబ్బతినవా? పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వంటి వాటితో నియామకాలను చేపట్టవచ్చు కదా అంటూ గవర్నర్‌ వ్యక్తం చేసిన సందేహంపై మంత్రి స్పందిస్తూ.. బోర్డు ద్వారా చేసే నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తామని, ఈ బోర్డు ద్వారా కేవలం టీచింగ్‌ సిబ్బందినే భర్తీ చేస్తామని, నాన్‌-టీచింగ్‌ ఖాళీలను టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఖాళీ ల భర్తీ పరిస్థితి ఏమిటని గవర్నర్‌ అడగ్గా.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. భేటీ చివర్లో.. ‘‘యూనివర్సిటీలు బాగుండాలనేదే నా తపన.. బిల్లు ద్వారా ఇబ్బంది కలగవద్దు కదా’’ అని గవర్నర్‌ వ్యాఖ్యానించగా.. తమ ఉద్దేశం కూడా అదేనని మంత్రి వివరించారు. మొత్తమ్మీద ఈ సమావేశం సవ్యంగానే ముగిసిందని, వర్సిటీల బిల్లును గవర్నర్‌ త్వరలోనే ఆమోదిస్తారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - 2022-11-11T11:42:56+05:30 IST