File pending: ప్రశ్నార్థకంగా 80వేల విద్యార్థుల భవితవ్యం
ABN , First Publish Date - 2022-12-16T11:14:09+05:30 IST
రాష్ట్రం(Telangana)లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల (Intermediate Annual Examinations Fees) ఫీజు చెల్లింపు గడువు ముగిసినా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఫలితంగా వేల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే
ఫీజు గడువు ముగిసినా కాలేజీలకు గుర్తింపు ఏది?
లేట్ ఫీజుతో 28వ తేదీ దాకా గడువు..
436 కళాశాలలకు ఇంకా అనుమతే లేదు
వివిధ కారణాలతో గుర్తింపు దక్కనివి మరో 90
ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఫైల్
ప్రశ్నార్థకంగా 70-80వేల మంది భవిష్యత్తు
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం(Telangana)లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల (Intermediate Annual Examinations Fees) ఫీజు చెల్లింపు గడువు ముగిసినా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. ఫలితంగా వేల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అడ్మిషన్ల (Admissions)ను పూర్తి చేసుకున్న ఆయా కాలేజీలు తమ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ కాలేజీలకు గుర్తింపును ఇస్తారా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మార్చి నెలలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు కూడా ముగిసింది. అయితే లేట్ ఫీజు రూ.2వేలతో చెల్లించేందుకు ఈనెల 28వ తేదీ వరకు గడువిచ్చారు. మరో పక్క రాష్ట్రంలో ఇంకా సుమారు 436 జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం అనుంతించలేదు. ఇందులో సుమారు 346 కాలేజీలు మిక్సుడ్ అక్యూపెన్సీ భవనాల్లో ఉన్నాయి. ఇలాంటి మిక్సుడ్ ఆక్యూపెన్సీ భవనాల్లోని కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలంటే...ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్‌వోసీ రావాలి. ఇలాంటి భవనాలకు ఫైర్ సర్వీసెస్ విభాగం ఎన్‌వోసీ ఇవ్వడం లేదు. దాంతో ఇందులోని కాలేజీలకు ప్రభుత్వం అనుతించడం లేదు. ప్రతీ ఏడాది ఇదే తంతు కొనసాగుతోంది. చివరి వరకు నాన్చుతూ... ఈ ఒక్క ఏడాదికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం ఆఖరి దశలో అనుమతులను జారీ చేస్తోంది.. ఈమేరకు ఈ దఫా కూడా సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉంది. ఇలాంటి కాలేజీలకు అనుమతించడానికి ఉద్దేశించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం(File pending)లో ఉంది. సీఎం(Cm kcr) ఆమోదం తెలిపితే...ఈ కాలేజీలకు అనుమతించే అవకాశం ఉంది. అలాగే మరో 90 కాలేజీలకు కూడా వివిధ కారణాలతో ఇంకా గుర్తింపు రాలేదు. పైన పేర్కొన్న కాలేజీల్లో సుమారు 70 నుంచి 80 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ కాలేజీలకు గుర్తింపు రాకపోతే... సదరు విద్యార్థులు ప్రైవేట్‌లో పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇలా ప్రైవేట్‌లో పాసైతే... నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అర్హత సాధించడం కుదరదు. దాంతో విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
శాశ్వత పరిష్కారం కావాలి: గౌరి సతీష్
మిక్సుడ్ అక్యూపెన్సీ కాలేజీల విషయంలో ప్రతీ ఏడాది చివరి వరకు ఇబ్బందులు ఉంటున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపాలని ప్రైవేటు జూనియర్ కాలేజీల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరి సతీష్ కోరారు. మిక్సుడ్ అక్యూపెన్సీ కాలేజీలకు ఫైర్ సర్వీసెస్ ఎన్‌వోసీ కావాలన్న నిబంధన కేవలం జూనియర్ కాలేజీలకే ఉందని, డిగ్రీ కాలేజీలు, స్కూళ్లకు ఇది వర్తించదని గుర్తు చేశారు. డిగ్రీ వంటి కాలేజీలకు ఈ ఎన్‌వోసీ అవసరం లేనప్పుడు, జూనియర్ కాలేజీలకు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. ఈ ఎన్‌వోసీకి సంబంధించిన ఉత్తర్వులను 2019-20 విద్యా సంవత్సరం నుంచి తీసుకువచ్చారని, అయితే... అంతకు ముందే ఈ కాలేజీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఈ సమస్యకు పరిష్కారంగా కాలేజీల షిప్టింగ్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు.