Gujarat Elections: రెండో విడత ఎన్నికలు.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

ABN , First Publish Date - 2022-12-01T15:54:30+05:30 IST

గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు

Gujarat Elections: రెండో విడత ఎన్నికలు.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల (Gujarat Elections) తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు పోలింగ్ (First Phase Pollling) జరుగుతోంది. మొత్తం 788 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ (BJP) మరోమారు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ (Congress) గట్టిపట్టుదలగా ఉంది. ఇక, పంజాబ్‌లానే గుజరాత్‌లోనూ ప్రభంజనం సృష్టించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎదురుచూస్తోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాలకు గాను నేడు (గురువారం) 89 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మిగతా స్థానాలకు ఈ నెల 5న (సోమవారం) ఎన్నికలు జరుగుతాయి. 8న ఫలితాలు వెల్లడవుతాయి. రెండో విడత ఎన్నికలు జరగనున్న స్థానాల్లో ప్రచారం కోసం బీజేపీ అగ్రనేతలందరూ బరిలోకి దిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.

ఓటర్లను కలుసుకునేందుకు ఇరుకు సందుల్లోకి కూడా దూరుతూ వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 1995 నుంచి గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అహ్మదాబాద్ నుంచి గోద్రా వరకు బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉందనుకున్న చోట మరింత పకడ్బందీగా ప్రచారం చేస్తున్నారు.

Updated Date - 2022-12-01T16:47:48+05:30 IST