Himachal Pradesh Opinion Poll: హిమాచల్‌‌లో గెలిచే పార్టీ ఇదేనట.. Zee News Opinion Poll చెప్పిందేంటంటే..

ABN , First Publish Date - 2022-11-09T21:20:40+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారోనన్న చర్చ జరుగుతోంది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

Himachal Pradesh Opinion Poll: హిమాచల్‌‌లో గెలిచే పార్టీ ఇదేనట.. Zee News Opinion Poll చెప్పిందేంటంటే..

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారోనన్న చర్చ జరుగుతోంది. నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Zee News Opinion Poll నిర్వహించింది. డిసెంబర్ 8న గుజరాత్ ఎన్నికల ఫలితాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 34 నుంచి 44 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని జీ న్యూస్ ఒపీనియన్ పోల్ (Himachal Pradesh Opinion Poll) అంచనా వేసింది.

బీజేపీ అధికారాన్ని తిరిగి దక్కించుకోబోతోందనేది ఈ ఒపీనియన్ పోల్ సారాంశంలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 24 నుంచి 28 స్థానాలు, ఇతరులకు 0-2 స్థానాలు రావొచ్చని జీ న్యూస్ ఒపీనియన్ పోల్ చెప్పుకొచ్చింది. ఆగస్ట్ 10 నుంచి నవంబర్ 7 వరకూ జీ న్యూస్ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించినట్లు పేర్కొంది. చంబా అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. డల్హౌసీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకుంటుందని తెలిపింది. చంబా జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో 3 బీజేపీ, 2 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందని జీ న్యూస్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

himachal-pradesh.jpg

దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కంగ్రా జిల్లాలలో కాంగ్రెస్, బీజేపీ చెరో ఏడు స్థానాలు దక్కించుకోనున్నట్లు ఒపీనియన్ పోల్ పేర్కొంది. కుల్లు జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తెలిపింది. మండీ జిల్లాలోని 10 స్థానాల్లో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉందని జీ న్యూస్ ఒపీనియన్ పోల్ తెలిపింది. పది స్థానాల్లో 9 అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని, ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది. హమీర్‌పూర్ జిల్లాలోని ఐదు స్థానాల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించవచ్చని ఒపీనియన్ పోల్ పేర్కొంది. Una జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో నాలుగు బీజేపీ, కాంగ్రెస్ ఒక స్థానం కైవసం చేసుకోవచ్చని Zee News ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. మొత్తంగా చూసుకుంటే.. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతోందని Zee News Opinion Poll తెలిపింది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్ర నేతలంతా ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Updated Date - 2022-11-09T22:08:45+05:30 IST