Phone Hacking : లిజ్ ట్రస్ ఫోన్‌ను పుతిన్ ఏజెంట్లు హ్యాక్ చేశారు!
ABN , First Publish Date - 2022-10-30T10:55:39+05:30 IST
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) వ్యక్తిగత ఫోన్‌ను కొందరు హ్యాక్ చేసినట్లు బ్రిటిష్ మీడియా శనివారం
లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ (Liz Truss) వ్యక్తిగత ఫోన్‌ను కొందరు హ్యాక్ చేసినట్లు బ్రిటిష్ మీడియా శనివారం పేర్కొంది. ఆమె ఆర్థిక మంత్రిగా పని చేసిన కాలంలో ఈ హ్యాకింగ్ జరిగినట్లు వెల్లడించింది. ఈ హ్యాకర్లు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఏజెంట్లు అనే అనుమానం వ్యక్తమవుతోందని తెలిపింది.
లిజ్ ట్రస్ మిత్ర దేశాల నేతలతో జరిపిన రహస్య చర్చల వివరాలు, ఆమె క్లోజ్ ఫ్రెండ్ క్వాసి క్వార్టెంగ్‌తో ఇచ్చిపుచ్చుకున్న ప్రైవేట్ సందేశాలు ఈ ఫోన్ ద్వారా హ్యాకర్లకు తెలిసినట్లు వివరించింది. కొన్ని దేశాల విదేశాంగ మంత్రులతో ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఆయుధాల సరఫరా గురించి జరిపిన చర్చల వివరాలు కూడా హ్యాకర్లకు తెలిసిపోయినట్లు పేర్కొంది. సుమారు ఓ సంవత్సరంపాటు ఇచ్చిపుచ్చుకున్న సందేశాలను వారు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు, మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను ట్రస్, క్వార్టెంగ్ విమర్శిస్తున్నట్లు తెలిపే సందేశాలను కూడా హ్యాకర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని బ్రిటిష్ మీడియా తెలిపింది. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం ప్రచారం జరిగిన సమయంలో ఈ హ్యాకింగ్‌ను గుర్తించారని పేర్కొంది.
ఇదిలావుండగా, బ్రిటన్ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ కథనాలపై స్పందించేందుకు నిరాకరించారు. సైబర్ ముప్పు నుంచి కాపాడేందుకు పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని కట్టుదిట్టంగా కాపాడుకోవడం గురించి మంత్రులకు నిత్యం చెప్తూ ఉంటామన్నారు.