Blasts Rock Ukraine: క్షిపణుల వర్షం కురిపించిన రష్యా.. చిగురుటాకులా వణికిన ఉక్రెయిన్
ABN , First Publish Date - 2022-12-29T17:45:34+05:30 IST
ఉక్రెయిన్(Ukraine)తో సుదీర్ఘంగా యుద్ధం చేసుకున్నరష్యా (Russia) గురువారం మరింతగా
కీవ్: ఉక్రెయిన్(Ukraine)తో సుదీర్ఘంగా యుద్ధం చేసుకున్నరష్యా (Russia) గురువారం మరింతగా చెలరేగిపోయింది. ఈ ఉదయం 100కుపైగా క్షిపణుల(Missiles)తో దాడిచేసింది. దీంతో కీవ్(Kyiv) చిగురుటాకులా వణికింది. క్షిపణి దాడులతో రాజధాని కీవ్ సహా పలు నగరాలు దద్దరిల్లాయి. ఉక్రెయిన్‌పై భారీ వైమానిక దాడి జరిగిందని, రష్యా 100కిపైగా క్షిపణులు ప్రయోగించిందని అధ్యక్ష కార్యాలయ సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.
కీవ్, జైతోమిర్,ఒడెసా నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఒడెసా, దినిప్రోపెట్రోవిస్క్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను క్రెమ్లిన్ నిరాకరించిన నేపథ్యంలో ఈ మెరుపుదాడులు జరగడం గమనార్హం. నాలుగుప్రాంతాల విలీనాన్ని కీవ్ అంగీకరించాల్సిందేనని రష్యా పట్టుబట్టింది. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం పది పాయింట్లతో శాంతి ప్రణాళికను రష్యా ముందుంచారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, బలగాలను ఉపసంహరించాలని ప్రతిపాదించారు.
రష్యా తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఉక్రెయిన్ తరచూ ఆరోపిస్తుండగా, రష్యా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తోంది. రష్యా తమ నగరాలు, పట్టణాలతోపాటు దేశంలోని మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. కాగా, బుధవారం రష్యా ప్రయోగించిన బాంబు ఖేర్సన్‌లోని ఓ ఆసుపత్రి ప్రసూతివార్డుపై పడింది. దీంతో ఆసుపత్రిలోని రోగులు, సిబ్బందిని అధికారులు షెల్టర్‌కు తరలించారు. ఖేర్సన్‌ను ఇటీవల రష్యా అధీనం నుంచి ఉక్రెయిన్ సైన్యం విడిపించింది. ఈ నగరాన్ని రష్యా దళాలు ఇప్పటికీ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి.