Pakistan: పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాసిమ్ మునీర్

ABN , First Publish Date - 2022-11-29T15:31:16+05:30 IST

పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌గా జనరల్ అసీమ్ మునీర్ మంగళవారంనాడు బాధ్యతలు చేపట్టారు. వరుసగా రెండు సార్లు ఆర్మీ చీఫ్‌గా...

Pakistan: పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఖాసిమ్ మునీర్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్‌ (Pakistan new Army Chief)గా జనరల్ అసీమ్ మునీర్ (Asim Munir) మంగళవారంనాడు బాధ్యతలు చేపట్టారు. వరుసగా రెండు సార్లు ఆర్మీ చీఫ్‌గా కొనసాగిన జావెద్ బజ్వా నేటితో రిటైర్ కావడంతో ఆయన స్థానంలో మునీర్ బాధ్యతలు చేపట్టారు. జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకగా జరిగిన కార్యక్రమంలో పాక్ 17వ ఆర్మీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.

పాక్ కొత్త ఆర్మీ చీఫ్‌గా మునీర్ పేరును ఈనెల 24న ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ నామినేట్ చేశారు. పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్‌ పదవే అత్యంత కీలకం. స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిజానికి లెప్ట్‌నెంట్ జనరల్‌గా ఉన్న మునీర్ నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27తో ముగియాల్సి ఉంది. అయితే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ఆయన పేరు ప్రకటించడంతో మరో మూడేళ్ల పాటు ఆయన పదవీకాలం పొడిగించినట్టయింది. మునీర్ ఇంతకుముందు ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. 2017 ప్రారంభంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ఐఎస్ఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ 8 నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను కొత్త చీఫ్‌గా నియమించారు. కాగా, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ పలు పేర్లు పరిశీలించి మునీర్‌కు ఆర్మీ చీఫ్ బాధ్యతలను తాజాగా అప్పజెప్పారు

Updated Date - 2022-11-29T15:31:19+05:30 IST