Assassination Attempt : ఇమ్రాన్ ఖాన్‌ను చంపాలనుకున్నాను... హత్యాయత్నం కేసులో నిందితుడు...
ABN , First Publish Date - 2022-11-03T19:36:52+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను హత్య చేయాలనుకున్నానని ఈ కేసులో నిందితుడు
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను హత్య చేయాలనుకున్నానని ఈ కేసులో నిందితుడు మహమ్మద్ నవీద్ (Mohammad Naveed) పోలీసులకు తెలిపాడు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే చంపాలనుకున్నానని తెలిపాడు. తాను ఈ నేరాన్ని తనంతట తానే చేశానని, తన వెనుక ఎవరూ లేరని, దీనిలో ఇతరుల ప్రమేయం లేదని చెప్పాడు. ఈ వివరాలను పాకిస్థాన్ మీడియా గురువారం వెల్లడించింది.
పాకిస్థాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఆయనతోపాటు మరికొందరు పీటీఐ నేతలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆయన రెండు కాళ్ళకు తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఆయన మేనేజర్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత పారిపోతున్న వ్యక్తి (మహమ్మద్ నవీద్)ని ఆ సభలో పాల్గొన్నవారు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ నిందితుడిని పోలీసులు ప్రశ్నించగా, తాను ఈ నేరాన్ని ఒంటరిగానే చేశానని, ఇతరుల ప్రమేయం లేదని చెప్పాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నందుకే ఆయనను కాల్చి చంపాలనుకున్నానని చెప్పాడు.
ఇదిలావుండగా, ఇమ్రాన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన మాట్లాడుతూ, తనకు అల్లా నూతన జీవితాన్ని ఇచ్చాడని చెప్పారు. పీటీఐ నేత ఫవద్ చౌదరి స్పందిస్తూ, ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్‌పై దాడి కాదని, యావత్తు పాకిస్థాన్‌పై జరిగిన దాడి అని పేర్కొన్నారు.
పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్ ఖాన్ కాలిలో తూటాలు తగిలి గాయపడ్డారని, ఆయన విషమ పరిస్థితిలో లేరని తెలుస్తోందని చెప్పారు. ఈ దాడి చాలా విచారకరమని, భయానకమని, పిరికిపంద చర్య అని తెలిపారు. గాయపడినవారందరినీ అల్లా దీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, ఇమ్రాన్ ఖాన్ సభపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఈ సంఘటనపై తక్షణం నివేదిక సమర్పించాలని ఇంటీరియర్ మినిస్టర్‌ను కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇమ్రాన్ ఖాన్ తదితరులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు, భద్రత కోసం పంజాబ్ ప్రభుత్వానికి సాధ్యమైన అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో హింసకు చోటు లేదన్నారు.
ఇమ్రాన్ హత్యకు కుట్ర : షేక్ రషీద్
పాకిస్థాన్ మాజీ ఇంటీరియర్ మినిస్టర్ షేక్ రషీద్ స్పందిస్తూ, ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. వారు నేరపూరిత మనస్తత్వంగలవారని దుయ్యబట్టారు.
ఇదిలావుండగా, ఈ కాల్పుల సంఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ సహా ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి మహమ్మద్ నవీద్ అని, ఆయన వజీరాబాద్‌కు చెందినవాడని తెలుస్తోంది. నిందితుడి నుంచి ఓ 9ఎంఎం పిస్టల్, రెండు ఖాళీ మ్యాగజైన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతను పీటీఐ నేత అలంగిర్ ఖాన్ వద్ద గార్డ్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా కథనాల ప్రకారం, షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, రానున్న ఎన్నికల్లో గెలవడానికి సానుభూతి కోసం ఈ దాడి జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.