Army Commander జమ్మూకశ్మీర్‌లో చురుకుగా 300 మంది ఉగ్రవాదులు

ABN , First Publish Date - 2022-11-22T19:03:50+05:30 IST

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం సుమారు 300 మంది ఉగ్రవాదులు ఉన్నారని, మరో 160 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌ ఎల్ఓసీ వెంబడి

Army Commander జమ్మూకశ్మీర్‌లో చురుకుగా 300 మంది ఉగ్రవాదులు

పూంచ్: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లో ప్రస్తుతం సుమారు 300 మంది ఉగ్రవాదులు (Terrorists) ఉన్నారని, మరో 160 మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌ ఎల్ఓసీ (LOC) వెంబడి పొంచి ఉండి భారత్‌ సరిహద్దుల్లోకి చొరబడేందుకు చూస్తున్నారని నార్తన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్.. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తెలిపారు. అయితే, 2019 ఆగస్టులో కశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత కేంద్రపాలిత ప్రాంతంలో గణనీయమైన మార్పులు వచ్చాయని, ఉగ్రవాద కార్యకలాపాలు చాలావరకూ నియంత్రించామని చెప్పారు.

''సుమారు 300 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నారు. అయితే వారిని ఎలాంటి బరితెంగింపు చర్యలకు పాల్పడనీయం'' అని మంగళవారంనాడిక్కడ జరిగిన చారిత్రక ''పూంచ్ లింగ్-అప్ డే'' ప్లాటినం జూబ్లీకి హాజరైన సందర్భంగా ద్వివేది చెప్పారు. పాకిస్థాన్ దురాక్రమణదారుల నుంచి సరిహద్దు జిల్లాను కాపాడేందుకు 1948లో భారత ఆర్మీ చేపట్టిన 'ఆపరేషన్ ఈజీ' స్మారకార్థం పూంచ్ లింక్-అప్ డే ప్లాటినం జూబ్లీ ఇక్కడ నిర్వహిస్తున్నారు.

మేము దేనికైనా రెడీ..

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను వెనక్కి తెచ్చుకుంటామంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల చేసిన ప్రకటనపై అడిగినప్పుడు, ఈ విషయంలో పార్లమెంటు తీర్మానం కూడా ఉందని, ఇదేమీ కొత్త విషయం కాదని ద్వివేది సమాధానమిచ్చారు. భారత ప్రభుత్వం ఏ ఆదేశాలిచ్చినా ఆ ఆదేశాలను తూచా తప్పకుండా ఇండియన్ ఆర్మీ పాటిస్తుందన్నారు. కశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత చాలా మార్పు వచ్చిందని, సివిల్ అడ్మినిస్ట్రేషన్ శాంతి భద్రతల నిర్వహణకు బాగా పనిచేస్తోందని, టెర్రిరిజం వెనకబాట పట్టడం నిశ్చయమని చెప్పారు. శాంతి, అభివృద్ధి పట్టాల మీదకు వచ్చాయన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరేందుకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఉగ్రవాదం చాలామటుకు అదుపులోకి వచ్చిందని తెలిపారు.

పాక్ సాధించేదేమీ లేదు..

పాకిస్థాన్ ఆయుధాలు పంపడం, కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి, ఓఐసీ వేదకలపై ప్రస్తావించడం వల్ల సాధించేదేమీ ఉండదని ద్వివేది ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమాయకులను టార్గెట్ చేసుకోవడం, చిన్న చిన్న ఆయుధాలు, మాదకద్రవ్యాలు పంపడం వంటి పనులకు పొరుగుదేశం పాల్పడుతోందని అన్నారు. ''బారాముల్లా (నార్త్ కశ్మీర్)లో రూ.45 లక్షల విలువైన మాదకద్రవ్యాలు, ఇతర ఆయుధాలు, గ్రెనేడ్లు స్వాధీనంచేసుకున్నాం. ఇతర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నాం. టెర్రరిస్టులను కాల్చిచంపితే స్మగ్లర్లను చంపుతున్నారని పాక్ చెబుతోంది. ఆ రకంగా డ్రగ్స్ పంపుతున్నట్టు పాక్ పరోక్షంగా అంగీకరిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్నది చాలా తప్పు'' అని ద్వివేది అన్నారు.

Updated Date - 2022-11-22T19:30:07+05:30 IST