Ganga Revival : గంగా నది ప్రక్షాళనలో ప్రజల భాగస్వామ్యం
ABN , First Publish Date - 2022-11-27T12:27:02+05:30 IST
గంగా నది ప్రక్షాళనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి.
లక్నో : గంగా నది ప్రక్షాళనకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. నీటి నాణ్యత మెరుగవుతుండటంతో యాత్రికులు, భక్తుల రాకపోకలు పెరిగాయి. దీంతో స్థానికులు ఉపాధి పొందగలుగుతున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ నీటి ప్రక్షాళన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఐఐటీ-కాన్పూరు, మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయం అధ్యయన బృందం నిర్ణయించింది.
గంగా (Ganga) నది కలుషితమైపోవడంతో దానిని ప్రక్షాళన చేయడం ఎలా? అంటూ నిపుణులు దశాబ్దాలపాటు ఆలోచించారు. మరోవైపు జీవనోపాధి కోసం ఈ నదిపై ఆధారపడినవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఈ నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సకారాత్మక ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో గంగా పరీవాహక ప్రాంతాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నీటి నాణ్యత మెరుగవుతుండటంతో భక్తులు, యాత్రికుల రాకపోకలు పెరిగాయి. ఫలితంగా స్థానికులకు జీవనోపాధి దొరుకుతోంది.
లా ట్రోబ్ విశ్వవిద్యాలయం, ఐఐటీ-కాన్పూరులకు చెందిన నిపుణుల బృందం ఇటీవల వారణాసి (Varanasi), కాన్పూరు (Kanpur) పట్టణాల్లో పర్యటించారు. గంగా నదిలోని కాలుష్యంలో 60 శాతం వరకు ఈ రెండు పట్టణాల్లోనే ఉంటుంది. అందువల్ల ఈ నీటిని ప్రక్షాళన చేయడంలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఈ బృందం నిర్ణయించింది. కాలుష్యం వల్ల ఏర్పడే సాంఘిక, ఆర్థిక ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ నది పరిసరాల్లో నివసిస్తున్నవారితో మాట్లాడింది. వీరితోపాటు ఈ నదితో సంబంధంగల ఇతరుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. వారి సాంఘిక కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలు వంటివాటి గురించి తెలుసుకుంది.
ఈ అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న జాయింట్ డాక్టొరల్ స్టూడెంట్ అంజలి యాదవ్ మాట్లాడుతూ, గంగా నది కాలుష్యం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? దాని గురించి వారికి ఏమి తెలుసు? ఆ కాలుష్యం వల్ల ఎటువంటి నష్టం జరగవచ్చునని భావిస్తున్నారు? నిర్ణయాలు తీసుకోవడంలో దీని ప్రభావం ఏమిటి? అనే అంశాలపై ప్రధాన దృష్టితో తాము అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. హోమాలు వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత మిగిలే వస్తువులు, పదార్థాలను నేరుగా నదిలోకి విసిరేస్తున్నారన్నారు. దీనివల్ల ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన కల్పించవలసి ఉందన్నారు. పురుగు మందులు, ఇతర హానికరమైన రసాయనాలను నదిలోకి విసరకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. శవ దహనాలకు కట్టెలను కాకుండా, విద్యుత్తు దహన వాటికలను ఉపయోగించే విధంగా ప్రజలను ప్రోత్సహించడానికి పూజారులు, సాధువుల సహకారాన్ని తీసుకోవాలన్నారు.
లా ట్రోబ్ విశ్వవిద్యాలయానికి చెందిన STEM అకడమిక్ ప్రొఫెసర్ ప్రేమ్ కురూప్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, విధానాలు, పద్ధతులు, ప్రక్రియ, ఆచరణ (People's Participation, policies, procedure, process, practice) అప్రోచ్‌ను తాము అనుసరిస్తున్నామన్నారు. ఇది గంగా నది ప్రక్షాళనలో భాగంగా కాలుష్యాన్ని తగ్గించడంకోసం స్వచ్ఛందంగా సహకరించే విధంగా అందరినీ భాగస్వాములను చేసే కార్యక్రమమని తెలిపారు. 2018 తర్వాత నీటి నాణ్యత మెరుగుపడుతోందని స్థానికులు తమకు చెప్పారన్నారు. నమామి గంగే ప్రాజెక్టు (Namami Gange Project) క్రింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారన్నారు. కాన్పూరులోని కాలుష్య కారక పరిశ్రమలన్నిటినీ ఇతర ప్రాంతాలకు తరలించినప్పటికీ, వ్యర్థ జలాల విడుదల సమస్య కొనసాగుతోందని చెప్పారు. విషపూరిత, శుద్ధి చేయని ద్రవ వ్యర్థాలను రాత్రివేళల్లో, తెల్లవారుజామున నదిలోకి వదులుతున్నారన్నారు. వారణాసిలో కూడా కొన్ని ఘాట్లలో ఇదే విధంగా వ్యర్థాలను నేరుగా నదిలోకి వదులుతున్నారని చెప్పారు.
వారణాసిలో పడవలను నడిపేవారు, బట్టలు ఉతికేవారు, దుకాణదారులు, భక్తులు పరిశుభ్రమైన ఘాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ల వద్ద ఘన వ్యర్థాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తమవుతోంది. జల పోలీసులు నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
వారణాసిలోని స్థానికుల కథనం ప్రకారం, కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉన్నచోట్ల గంగా నదిలోకి శవాలను పడేయడం లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ లేనిచోట్ల మాత్రం శవాలను నదిలోకి విసిరేస్తున్నారు. వారణాసిలోని హరిశ్చంద్ర ఘాట్ వద్ద పూజలు చేయించే అర్చకుడు ఒకరు మాట్లాడుతూ, గంగా నదికి హాని కలిగించే పనులను మానుకోవాలన్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈ ఏడాది ఏప్రిల్‌లో మాట్లాడుతూ, గంగా నది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలన్నారు.