Himachal polls: బీజేపీ మళ్లీ అధికారంలోకొస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు.. మేనిఫెస్టో విడుదల
ABN , First Publish Date - 2022-11-06T12:48:50+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Himachal Pradesh Assembly elections) మేనిఫెస్టోను బీజేపీ (BJP) ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని (Uniform Civil Code) అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Himachal Pradesh Assembly elections) మేనిఫెస్టోను బీజేపీ (BJP) ఆదివారం విడుదల చేసింది. బీజేపీ తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతిని (Uniform Civil Code) అమలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఈ మేరకు సిమ్లాలో జరిగిన ‘బీజేపీ సంకల్ప్ పాత్ర2022’ కార్యక్రమంలో 11-పాయింట్ల మేనిఫెస్టోను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా విడుదల చేశారు. ఉమ్మడి సమాజం, యువత, రైతులకు సాధికారత, తోటల పెంపకానికి చేయూత, ప్రభుత్వ ఉద్యోగులకు తగిన న్యాయం, పర్యాటకానికి మరింత ఊతమివ్వడమే లక్ష్యంగా మేనిఫెస్టోని రూపొందించామని ఆయన చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో వాగ్ధానం చేయని లక్ష్యాలను కూడా బీజేపీ సాధించిందని అన్నారు.
మేనిఫెస్టో కీలక పాయింట్లు..
- జాతీయ స్థాయిలో ఉమ్మడి పౌరస్మృతి విషయంలో క్రమక్రమంగా ముందుకెళ్తాం. లక్ష్యాలను నెరవేర్చుతాం.
- ప్రభుత్వ ఉద్యోగాలు సహా రాష్ట్రంలో 8 లక్షల ఉపాధి అవకాశాలు
- పర్వతప్రాంతానికి పెట్టింది పేరైన హిమాచల్‌ప్రదేశ్‌లోని అన్ని గ్రామాల రోడ్లను పక్కా రోడ్లతో అనుసంధానిస్తాం.
- సీఎం అన్నదాత స్కీమ్ ద్వారా 9 లక్షల మంది రైతులకు లబ్ది.
- మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచేందుకు ‘శక్తి’ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభం.
- స్థానిక మార్కెట్లు, కుటీర పరిశ్రమలకు ఊతమివ్వడమే లక్ష్యంగా యాపిల్ ప్యాకేజింగ్‌పై 12 శాతం ట్యాక్స్ విధింపు. అదనపు జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- కొత్తగా 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం. మొబైల్ క్లీనిక్ వ్యాన్ల సంఖ్య రెట్టింపు.
- రాష్ట్రంలోని యువతకు సాధికారత అందించడమే లక్ష్యంగా రూ.900 కోట్లతో స్టార్టప్ యూనిట్ ఏర్పాటు.
- అమర సైనికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేసియా మరింత పెంపు.
- వక్ఫ్ బోర్డుపై సర్వే. ఆస్తుల అక్రమ వినియోగంపై తనిఖీ.
- మహిళా సాధికారత దృష్ట్యా పేద మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లతోపాటు ఇతర హామీలు ఆచరణ.