CJI Chandrachud : కేసు ఫైల్ తీసుకెళ్ళని న్యాయవాది... సచిన్ టెండూల్కర్‌తో పోల్చిన సీజేఐ...
ABN , First Publish Date - 2022-11-18T15:52:09+05:30 IST
కర్తవ్య పాలన చేయకపోతే ఇబ్బందులు తప్పవు. వృత్తి నిర్వహణకు అవసరమైనవాటినే వదిలిపెట్టడం వల్ల దుష్ఫలితాలు వస్తాయి.
న్యూఢిల్లీ : కర్తవ్య పాలన చేయకపోతే ఇబ్బందులు తప్పవు. వృత్తి నిర్వహణకు అవసరమైనవాటినే వదిలిపెట్టడం వల్ల దుష్ఫలితాలు వస్తాయి. కక్షిదారులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి న్యాయవాదులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. కేసులో వాదనలు వినిపించవలసిన సమయంలో దానికి సంబంధించిన ఫైలును న్యాయస్థానానికి తీసుకెళ్ళకపోవడం సరికాదు. ఈ పరిస్థితి సుప్రీంకోర్టులో శుక్రవారం కనిపించింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) సున్నితంగా స్పందించారు.
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం సమక్షంలో శుక్రవారం ఓ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలు వినిపించవలసిన న్యాయవాది చేతిలో సంబంధిత కేసు ఫైలు లేకపోవడంతో సీజేఐ స్పందిస్తూ, బ్రీఫ్‌ను వెంట తీసుకురాని న్యాయవాది బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ వంటివారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదన్నారు. గౌన్, బ్యాండ్ ధరించి వచ్చారని, కానీ దస్త్రాలు లేవని అన్నారు. ‘‘మీ బ్రీఫ్ (కేసు ఫైలు) ఎల్లప్పుడూ మీ వెంట ఉండాల’’ని చెప్పారు.