Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ శరీరం ‘కవచం’గా మారింది : కన్నయ్య కుమార్
ABN , First Publish Date - 2022-12-24T15:11:17+05:30 IST
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గడ్డకట్టుకుపోయే శీతల వాతావరణంలో చలిని తట్టుకోవడానికి ఉపయోగించే వస్త్రాలను ధరించకుండా,
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గడ్డకట్టుకుపోయే శీతల వాతావరణంలో చలిని తట్టుకోవడానికి ఉపయోగించే వస్త్రాలను ధరించకుండా, కేవలం టీ-షర్ట్ ధరించి నడవగలిగే సత్తా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని ఆ పార్టీ నేత కన్నయ్య కుమార్ చెప్పారు. బీజేపీ చేస్తున్న విద్వేషపూరిత దాడులను ఆయన తట్టుకోగలిగారని, అందువల్ల ఆయన శరీరం కవచంగా మారిందని చెప్పారు. ఇది చాలా గొప్ప విషయమన్నారు. అనేక దాడులను ఎదుర్కొన్నపుడు శరీరం కవచంగా మారిపోతుందన్నారు.
రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో కన్నయ్య కుమార్ (Kanhaiya Kumar) పాల్గొంటున్నారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల నుంచి విముక్తి పొందాలంటే మనమంతా సుహృద్భావంతో కలిసికట్టుగా జీవించవలసి ఉంటుందని ఈ యాత్ర సందేశమని చెప్పారు. మన హృదయాల్లో, దేశంలో ప్రేమ నిండి ఉండాలని తాము ఆశిస్తున్నామన్నారు.
ఈ యాత్రను పట్టించుకోకూడదని మొదట్లో బీజేపీ భావించిందన్నారు. అయితే ప్రజలు ఈ యాత్రలో భాగస్వాములవుతుండటంతో బీజేపీ పట్టించుకోకుండా ఉండలేకపోతోందన్నారు. సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మతపరమైన అంశాలను చర్చిస్తుండటంతో ప్రజలు మద్దతు పలుకుతున్నారన్నారు. మరోవైపు ఈ యాత్ర సుహృద్భావ సందేశాన్ని ఇస్తోందని, అందువల్ల కార్మికులు, యువత, రైతులు వంటి సమాజంలోని అన్ని వర్గాలవారూ ఆకర్షితులవుతున్నారని చెప్పారు. బీజేపీ తిరిగి తన పాత కుళ్లు చిట్కాలను ప్రయోగించడానికి కారణం ఇదేనన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేస్తే, తాము పాటిస్తామని చెప్పారు. కోవిడ్ అనేది ఓ వ్యాధి అని, దానిని రాజకీయ సాకుగా తీసుకోరాదని చెప్పారు.
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర శనివారం ఉదయం ఢిల్లీలో ప్రవేశించింది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి రాహుల్ తదితరులు ఢిల్లీలో ప్రవేశించారు. ఢిల్లీలో చలి తీవ్రత ఉన్నప్పటికీ రాహుల్ హాఫ్ స్లీవ్స్ టీ-షర్ట్ ధరించారు. చలిని నిరోధించే వస్త్రాలను ధరించలేదు. ఈ యాత్రలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జీవాలా ఉన్నారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఈ యాత్రలో శనివారం పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా కొందరు స్వాతంత్ర్య సమర యోధులు కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం.