Twitter Blue Tick : బ్లూ టిక్ ఫీజుపై వెనుకకు తగ్గని ఎలన్ మస్క్
ABN , First Publish Date - 2022-11-05T11:55:56+05:30 IST
ట్విటర్ ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ రుసుము (Blue Tick Verification Fee)ను చెల్లించాల్సిందేనని ఆ కంపెనీ
న్యూఢిల్లీ : ట్విటర్ ఖాతా బ్లూ టిక్ వెరిఫికేషన్ రుసుము (Blue Tick Verification Fee)ను చెల్లించాల్సిందేనని ఆ కంపెనీ నూతన యజమాని ఎలన్ మస్క్ (Elon Musk) స్పష్టం చేశారు. తనను రోజంతా విమర్శించినా, ఈ రుసుము 8 డాలర్లేనని తెలిపారు. ట్విటర్ కంపెనీలో భారీగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ తర్వాత ఆయన ఇచ్చిన ట్వీట్‌లో ప్రజలకే అధికారం అని తెలిపారు. ఉద్యోగులను తొలగించడం మినహా తనకు మరో మార్గం కనిపించలేదన్నారు.
ఓ ఈ-మెయిల్ ద్వారా తొలగింపు బాధిత ఉద్యోగులకు పింక్ స్లిప్‌లను ట్విటర్ పంపించింది. ఆ తర్వాత ఎలన్ మస్క్ ‘‘ప్రజలకే అధికారం’’ అంటూ ఇచ్చిన ట్వీట్ వైరల్ అయింది. దీనికి దాదాపు 14 వేల రీట్వీట్లు, లక్షకుపైగా లైక్‌లు వచ్చాయి.
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు గురించి ప్రస్తావిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘రోజంతా నన్ను విమర్శించుకోండి, కానీ దాని ధర 8 డాలర్లు’’ అని స్పష్టం చేశారు.
ఈ ఫీజు నెలకు 20 డాలర్లు ఉంటుందని మొదట్లో చాలా కథనాలు వచ్చాయి. కానీ మస్క్ వెల్లడించిన వివరాల ప్రకారం, నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. తాను బిల్లులను చెల్లించవలసి ఉంటుంది కాబట్టి ఈ రుసుమును నిర్ణయించినట్లు ఆయన సమర్థించుకుంటున్నారు.
ట్విటర్ కంపెనీలో 7,500 మంది ఉద్యోగులు పని చేసేవారు. వీరిలో సుమారు సగం మందిని శుక్రవారం తొలగించారు. తొలగింపునకు గురైన ఉద్యోగులకు తక్షణమే కంపెనీ కంప్యూటర్లు, ఈ-మెయిల్ ఐడీల యాక్సెస్‌ను లేకుండా చేశారు. రోజుకు నాలుగు మిలియన్ డాలర్లు నష్టపోతున్నందువల్ల ఉద్యోగులను తగ్గించక తప్పలేదని మస్క్ పేర్కొన్నారు.
44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన లక్షలాది డాలర్ల రుణం తీసుకున్నారు. అంతేకాకుండా 15.5 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లను అమ్మేశారు.
ky/i