Elon Musk Twitter : ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ తొలగింపు

ABN , First Publish Date - 2022-10-28T11:00:37+05:30 IST

సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ (Twitter) యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ (Elon Musk) గురువారం చేపట్టారు.

Elon Musk Twitter : ట్విటర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ తొలగింపు
పరాగ్ అగర్వాల్, ఎలన్ మస్క్

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ (Twitter) యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ (Elon Musk) గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ (Chief Executive Officer) పరాగ్ అగర్వాల్ (Parag Agrawal), లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ విభాగం అధిపతి విజయ గద్దె (Vijaya Gadde), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ (Ned Segal), జనరల్ కౌన్సెల్ సియాన్ ఎడ్జెట్‌లను తొలగించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయం నుంచి పరాగ్ అగర్వాల్, సెగల్, ఎడ్జెట్‌‌ల వెంట ఇద్దరు వ్యక్తులు వెళ్ళి బయటకు పంపినట్లు తెలుస్తోంది.

ట్విటర్‌ను ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొన్నారు. దాదాపు ఆరు నెలలపాటు పబ్లిక్, లీగల్ వివాదాల తర్వాత గురువారం దీనిని సొంతం చేసుకున్నారు. ట్విటర్‌లో స్పామ్ బాట్స్‌ను చీల్చి చెండాడుతానని ఆయన చెప్పారు. యూజర్లకు కంటెంట్‌ను ఎలా చేరవేయాలో నిర్ణయించే ఆల్గోరిథమ్స్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచుతానన్నారు. విద్వేషం, విభజనవాదాలకు వేదికగా ట్విటర్‌ పని చేయకుండా చూస్తానన్నారు. అదే సమయంలో సెన్సార్‌షిప్‌ను పరిమితం చేస్తానని తెలిపారు. తాను ట్విటర్‌ను కొనడం వెనుక లక్ష్యం మరింత సొమ్ము సంపాదించుకోవడం కాదని చెప్పారు. మానవాళి అంటే తనకు చాలా ఇష్టమని, దానికి సాయపడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అయితే ఈ లక్ష్యాలన్నిటినీ ఏ విధంగా సాధిస్తారు? ఎవరు ఈ కంపెనీని నడుపుతారు? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ట్విటర్ షేర్‌హోల్డర్స్‌కు ఒక్కొక్క షేర్‌కు 54.20 డాలర్లు చెల్లిస్తారు. ఇకపై నుంచి ట్విటర్ ప్రైవేట్ కంపెనీగా పని చేస్తుంది.

Updated Date - 2022-10-28T11:23:38+05:30 IST