Gujarat Elections Results: ఒవైసీకి షాకిచ్చిన గుజరాతీలు
ABN , First Publish Date - 2022-12-08T21:48:05+05:30 IST
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి గుజరాతీలు షాకిచ్చిరు.
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Gujarat Assembly Elections) ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కి గుజరాతీలు షాకిచ్చిరు. ఆయన పార్టీకి కేవలం 0.29 శాతం మాత్రమే ఓట్లు పడ్డాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ఎంఐఎం పార్టీ కేవలం 13 మంది అభ్యర్థులను మాత్రమే బరిలో దించింది. అయితే వీరిలో చాలామందికి నోటా కన్నా తక్కువ ఓట్లు పడ్డాయి. ఎంఐఎం టికెట్లు ఇచ్చిన అభ్యర్థుల్లో 12 మంది ముస్లిం అభ్యర్థులే.
2002 నుంచి మొదలుకుని ఎప్పుడు హిందుత్వ విషయాలు వచ్చినా ఎంఐఎం అధినేత బీజేపీపై, నరేంద్ర మోదీపై విరుచుకుపడుతుంటారు. గుజరాత్ ముస్లింలకు తాము మద్దతుగా ఉంటామని ఒవైసీ జాతీయ మీడియా ద్వారా చెబుతుంటారు. అయితే గుజరాతీ ముస్లింలు మాత్రం ఒవైసీ పార్టీకి అండగా నిలబడలేదు. అన్ని చోట్లా చిత్తుగా ఓడించారు. గుజరాత్ ముస్లింల మద్దతు తనకు తప్పకుండా ఉంటుందని ఆశించిన ఒవైసీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయి.
అహ్మదాబాద్‌లోని జమాల్పూర్ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి సాబీర్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ గెలిచారు కూడా. గెలిచాక కాంగ్రెస్ కార్యకర్తలు ఒవైసీ ఫొటోలపై నిల్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ తమ ఓటమికి ఒవైసీయే కారణమని ఆరోపించింది. గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జే ఠాకోర్ విలేకరులతో మాట్లాడుతూ ఒవైసీపై విరుచుకుపడ్డారు. ఒవైసీ వల్లే తమ ఓట్లు చీలాయన్నారు. అందుకే తాము పరాజయం పాలయ్యామని చెప్పారు.