Hiijab : ఇరాన్‌లో హిజాబ్‌ హీట్‌

ABN , First Publish Date - 2022-11-11T03:58:36+05:30 IST

ఇరాన్‌లో మహిళలు నడిపిస్తున్న హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం మరింత వేడెక్కింది. ఇస్లామ్‌ మతపెద్దలను ఉద్యమకారులు నేరుగా ఎదిరిస్తున్నారు. వారి తలపాగాలను లాగేసి దొరక్కుండా మహిళలు

Hiijab : ఇరాన్‌లో హిజాబ్‌ హీట్‌

వీధుల్లో మత గురువులతో మహిళల బాహాబాహీ.. వారి తలపాగాలు లాగేసి పరుగులు

54రోజుల ఉద్యమం... కాల్పుల్లో 328మంది మృతి

న్యూఢిల్లీ, నవంబరు 10 : ఇరాన్‌లో మహిళలు నడిపిస్తున్న హిజాబ్‌ వ్యతిరేక ఉద్యమం మరింత వేడెక్కింది. ఇస్లామ్‌ మతపెద్దలను ఉద్యమకారులు నేరుగా ఎదిరిస్తున్నారు. వారి తలపాగాలను లాగేసి దొరక్కుండా మహిళలు పరుగుతీస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. రోడ్డుపై ఎదురుపడిన మహిళలను ‘హిజాబ్‌ ధరించండి’ అని అడగడమే ఆలస్యం మత గురువులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ‘ఈ దేశాన్ని 40 ఏళ్లుగా నాశనం చేశారు. చాల్లే... ఇక బ్యాగులు సర్దుకుని కదలండి’ అంటూ ముఖం మీదే చెప్పేస్తున్నారు. మరికొందరు... ‘ఇది నా సొంత విషయం. మీ సంగతి చూసుకోండి’ అని కటువుగా బదులిస్తే, ఇంకొందరు ‘నేను ధరించను.. నా ఇష్టం’ అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇరాన్‌లో తప్పనిసరి చేసిన హిజాబ్‌ను ధరించలేదనే కారణంగా అరెస్టు చేసి నైతిక పోలీసులు పెట్టిన చిత్రహింసలకు మహ్స అమీనీ మరణించిన ఘటన మహిళలు మూకుమ్మడిగా పెద్దఎత్తున రోడ్డెక్కేలా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి హిజాబ్‌ ధరించకుండా తమ ధిక్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్ర మంలో ఇస్లాం పెద్దలు ప్రశ్నిస్తే, వారితో బాహాబాహీకి దిగుతున్నారు. ‘ఈ దేశం నాది. హిజాబ్‌ను ధరించాలో లేదో నువ్వు నాకు చెప్పొద్దు’ అంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. 54 రోజులుగా సాగుతున్న హిజాబ్‌ వ్యతిరేక పోరులో సుమారు 328 మంది మహిళలు సైన్యం జరిపిన కాల్పుల్లో చనిపోగా, 14 వేల మందికిపైగా ఉద్యమకారులు జైలు పాలయ్యారు.

మహిళలపై తాలిబన్ల అణచివేత

కాబూల్‌, నవంబరు 10: ఆఫ్గాన్‌లో మహిళలపై తాలిబన్ల అణచివేత ఽఽధోరణి కొనసాగుతోంది. జిమ్‌లు, పార్కుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు తాలిబన్లు గురువారం తెలిపారు. గతేడాది అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు బాలికలకు మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాన్ని నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించారు. తాజాగా పార్కుల్లో, జిమ్‌లలో మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం తక్షణమే అమల్లోకి రానున్నట్లు తాలిబన్లు తెలిపారు. మహిళలు పురుషులతో కలిసి పార్కులకు వెళ్లడం, హిజాబ్‌ను ధరించకపోవడం వల్లనే ఈ చట్టాన్ని రూపొందించినట్లు తాలిబాన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-11-11T11:03:06+05:30 IST