Himchal pradesh: సీఎం పదవికి పోటీ ఈ ముగ్గురి మధ్యే
ABN , First Publish Date - 2022-12-09T10:28:31+05:30 IST
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తు..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తు మొదలైంది. ప్రధానంగా ముగ్గురు నేతలు సీఎం రేసులో (CM Race) ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ప్రతిభా సింగ్ (Pratibha Singh), సుఖ్విందర్ సింగ్ సుఖు (Sukhvinder Sing Sukhu), ముఖేష్ అగ్నిహోత్రి (Mukesh Agnihotri) సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ప్రతిభా సింగ్ హిమాచల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండటంతో పాటు దివంగత సీఎం వీరభద్ర సింగ్ సతీమణి కూడా. వీరభద్ర సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆరు సార్లు పనిచేశారు. సుఖ్విందర్ సింగ్ సుఖు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. అగ్నిహోత్రి సీఎల్‌పీ నేతగా, విపక్ష నేతగా ఉన్నారు.
సుఖు, అగ్నిహోత్రి ఇప్పటికే కాంగ్రెస్ పరిశీలకులైన భూపిందర్ సింగ్ హుడా, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌ను ఛండీగఢ్‌లో కలుసుకుని సీఎం పదవిపై తమ మనసులోని మాటను తెలియజేశారని సమాచారం. వీరభద్ర సింగ్ కుటుంబం నుంచే సీఎం పదవి ఉంటుందని ప్రతిభా సింగ్ స్పష్టం చేస్తున్నారు. ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ సిమ్లా రూరల్ సీటు నుంచి గెలుపొందారు. సిమ్లాలో శుక్రవారంనాడు జరిగే సమావేశంలో సీఎం రేసులో ఉన్న ముగ్గురు నేతలు తమకున్న ఎమ్మెల్యేల బలాన్ని పరిశీలకులకు వివరించే అవకాశం ఉంది. ఏఐసీసీ హిమాచల్ ప్రదేశ్ ఇన్‌చార్జి రాజీవ్ శుక్లా, బఘెల్, హుడాలు సిమ్రాలు సిమ్లాలో జరిగే కీలక సమావేశంలో పాల్గొంటారు.
కాగా, ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారడం హిమాచల్ సంప్రదాయంగా ఉంది. బీజేపీ అధికారానికి ఈసారి కాంగ్రెస్ గండికొట్టింది. ఓటమిని అంగీకరించిన హిమాచల్ సీఎం ఠాకూర్ గురువారంనాడు తన రాజీనామాను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు అందజేసింది. 68 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25, స్వతంత్ర అభ్యర్థులు 4 సీట్లు గెలుచుకోగా, ఆప్ ఖాతా కూడా తెరవలేదు.