Bharat jodo: కొత్తకోణం... రాహుల్‌లో రాజకీయ తాత్వికత
ABN , First Publish Date - 2022-11-29T14:53:44+05:30 IST
రాహుల్ గాంధీ ఇప్పుడు మారిన మనిషా? భారత్ జోడో యాత్ర ఆయనకున్న ఇమేజ్‌లో మార్పులు తీసుకురానుందా?. ఆయన దేశవ్యాప్త యాత్ర తమ నాయకునిపై ప్రజలకున్న అభిప్రాయంలో..
న్యూఢిల్లీ: రాహుల్ (Rahul Gandhi) ఇప్పుడు మారిన మనిషా? భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ఆయనకున్న ఇమేజ్‌లో మార్పులు తీసుకురానుందా?. ఆయన దేశవ్యాప్త యాత్ర తమ నాయకునిపై ప్రజలకున్న అభిప్రాయంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి, పార్టీ పునరుద్ధరణకు ఎంతగానో ఉపకరిస్తుందని కాంగ్రెస్ ఆశలు ఏమి కానున్నాయి? రాహుల్ మాటల్లో కొత్త రాజకీయ ఆధ్యాత్మిక పరిణతి తొంగిచూడటమే ఈ వరుస ప్రశ్నలకు కారణం. ''నేను రాహుల్‌ననే భావన ఏళ్ల క్రితమే వదలిపెట్టాను'' అని ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
సహజంగా ఆధ్యాత్మిక వేత్తలు 'నేను' అంటే ఏమిటో తెలుసుకోమని చెబుతుంటారు. 'నేను' అనేది అందరికీ కనిపించే దేహం కాదని, కనిపించని ఆత్మ అని, నేను ఆత్మ స్వరూపుడనని గ్రహించడమే ఆధ్యాత్మిక విద్యలో కీలక మెట్టు అని అంటుంటారు. అసలైన 'నేను'కు పేరు ఉండదనేది వేదాంతుల అభిప్రాయం. రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యలు ఆ కోణంలోంచి చేసినవేనా అనే విషయం ఇప్పుడు పలువురిలో చర్చనీయాంశమవుతోంది.
''నేను రాహుల్‌ననే భావనను ఏళ్ల క్రితమే వదిలేశాను. రాహుల్ గాంధీ మీ మనస్సులో ఉన్నాడు, నా మనసులో కాదు. అర్ధమైందనుకుంటాను'' అని రాహుల్ చెప్పడంతో మీడియా సమావేశానికి హాజరైన కొందరు చప్పట్లు చరిచారు. రాహుల్ తన సంభాషణలు కొనసాగిస్తూ, అటు చూడండి...ఎవరో చప్పట్లు కొడుతున్నారు. మీకు అర్ధమైందా? ఒక వ్యక్తికి అర్ధమైంది. ఇది మనదేశ తాత్వికత. అర్ధం చేసుకుంటే, మీకు కూడా మేలు కలుగుతుంది'' అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్ జోడో యాత్ర నుంచి నేర్చుకున్న విషయాలపై అడిగిన మరో ప్రశ్నకు ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ యాత్ర తనలో సహనశక్తిని పెంచిందని, గతంలో ఒకటి, రెండు గంటలకు ఒకసారి చిరాకు పడేవాడిననని, ఇప్పుడు 8 గంటల వరకూ సహనంతో ఉండగలుగుతున్నానని చెప్పారు.
జనంతో మమేకమయ్యే ఈ తరహా కార్యక్రమానికి ఇంతకు మందు ఆలోచన చేశారా అని మరో విలేకరి రాహుల్‌ను ప్రశ్నించినప్పుడు.. 'ఏది జరగాలన్నా దానికి సరైన సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. గతంలో ఇలాంటిది జరగలేదు. నాకు 25-26 ఏళ్లు ఉన్నప్పుడు ఇలాంటి యాత్ర జరిగినట్టు గుర్తు. జైరామ్ (రమేష్) గారికి కూడా ఈ విషయం తెలియదు. అయితే ఏడాది క్రితమే మాస్ కాంటాక్ట్ యోచన చేశాను. కోవిడ్ కావచ్చు, మరో కారణం కావచ్చు, నా ఆలోచన కార్యరూపంలోకి రాలేదు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది' అని రాహుల్ అన్నారు. భారతీయ ఆత్మను ఆర్ఎస్ఎస్-బీజేపీ దెబ్బతీసి, ధ్వంసం చేశాయని, వాటిని తిరిగి పునరుద్ధించేందుకు ఒక 'తపస్సు'గా తాను ప్రచారం సాగిస్తున్నానని ఆయన తెలిపారు.