Tamil Nadu : తిరువణ్ణామలైలో దేవతా విగ్రహానికి సీసీటీవీ కెమెరా బిగింపు... బీజేపీ ఆగ్రహం...
ABN , First Publish Date - 2022-12-02T10:23:07+05:30 IST
తిరువణ్ణామలైలో ఓ దేవతా విగ్రహానికి సీసీటీవీ కెమెరాను బిగించడంపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చెన్నై : తిరువణ్ణామలైలో ఓ దేవతా విగ్రహానికి సీసీటీవీ కెమెరాను బిగించడంపై బీజేపీ (BJP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచలేశ్వరుని దేవాలయంలో ఓ విగ్రహం ముఖానికి సీసీటీవీ కెమెరాను అమర్చడం చాలా దారుణమని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అణ్ణామలై (Annamalai) పేర్కొన్నారు. డీఎంకే (DMK) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఆగమాల పట్ల గౌరవం లేదన్నారు.
హిందూ మతపరమైన, దాతృత్వ దేవాదాయ శాఖను నాస్తికులు నిర్వహిస్తున్నారని, ఓ దేవతా విగ్రహం ముఖానికి సీసీటీవీ కెమెరాను అమర్చారని తెలిపారు. సరైన మనస్తత్వం ఉన్నవారెవరూ ఇటువంటి పనులు చేయరని అన్నారు. ఇది డీఎంకే ప్రణాళికాబద్ధ చర్య అని ఆరోపించారు. మెజారిటీ మతస్థులకు సమస్యలు సృష్టించి, మైనారిటీలను సంతోషపరచాలని డీఎంకే ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. ఈ విధ్వంసానికి బాధ్యతను ఎవరు స్వీకరిస్తారని ప్రశ్నించారు.
హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి విశృంఖలంగా ఉందన్నారు. దేవీ, దేవతల పురాతన ఆభరణాలను కరిగించి, గోల్డ్ బార్స్‌గా మార్చుతున్నారన్నారు. దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఆధ్యాత్మిక విశ్వాసాలను డీఎంకే నిరంతరం అగౌరవపరుస్తోందన్నారు. దీనిని ప్రజలు కానీ, దేవుళ్లు కానీ క్షమించరని చెప్పారు. అర్చకులకు శిక్షణ కాలాన్ని ఐదేళ్ళ నుంచి ఒక ఏడాదికి తగ్గించడాన్ని ఖండించారు. డీఎంకే తన భావజాలాన్ని సంప్రదాయాలపైనా, ఆధ్యాత్మిక మఠాలపైనా రుద్దేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు నాస్తికులు అయినప్పటికీ, సంస్కృతి, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆగమాల నియమ, నిబంధనలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.