India Vs China : చైనాకు దీటైన జవాబు... భారత్ ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2022-12-31T20:35:30+05:30 IST

చైనా వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తనవైపు భూభాగంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. అందుకు దీటుగా

India Vs China : చైనాకు దీటైన జవాబు... భారత్ ఏం చేసిందంటే...
Nyoma Airfield

న్యూఢిల్లీ : చైనా వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి తనవైపు భూభాగంలో మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. అందుకు దీటుగా భారత దేశం కూడా సిద్ధమవుతోంది. ఎల్ఏసీకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, లడఖ్‌లోని నియోమా (Nyoma) వద్ద వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు మేజర్ బిడ్‌ను శనివారం ఆహ్వానించింది. దీని నిర్మాణం పూర్తయితే మన దేశంలో అత్యంత ఎత్తయిన వైమానిక స్థావరం ఇదే అవుతుంది.

యుద్ధ విమానాల కార్యకలాపాల కోసం ఈ స్థావరాన్ని రెండేళ్ళలో సిద్ధం చేయాలని లక్ష్యం. యుద్ధ విమానాలు దిగడం, బయల్దేరడం, మెయింటెనెన్స్ చేయడం కోసం దీనిని నిర్మిస్తారు. దీని నిర్మాణానికి రూ.214 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 1,235 ఎకరాల విస్తీర్ణంలో, 2.7 కిలోమీటర్ల పొడవైన రన్‌‌వేను నిర్మిస్తారు. సైనిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ దీని నిర్మాణానికి కాంట్రాక్టర్లను ఆహ్వానించింది.

యుద్ధ విమానాలు ఇరువైపుల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా దీనిని నిర్మిస్తారు. సున్నితమైన ఈ ప్రాంతంలో దళాల రాకపోకలకు, అవసరమైన ఆయుధాలు, ఇతర వస్తువులు, పరికరాలు వంటివాటిని రవాణా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

లేహ్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో నియోమా ఉంది. 13,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో వైమానిక స్థావరాన్ని నిర్మించడం వల్ల భారత దేశ సామర్థ్యంలో ఇప్పటి వరకు ఉన్న లోపాన్ని సరిచేసినట్లవుతుంది. ఇక్కడ ప్రస్తుతం అపాచీ హెలికాప్టర్లు, చినూక్ హెవీ లిఫ్ట్ చాపర్స్, ఎంఐ-17 హెలికాప్టర్లు, సీ-130జే స్పెషల్ ఆపరేషన్స్ విమానం రాకపోకలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-12-31T20:35:35+05:30 IST