India Vs China : నీ దూకుడును సహించేది లేదు... చైనాకు స్పష్టం చేసిన జైశంకర్...
ABN , First Publish Date - 2022-12-07T20:27:00+05:30 IST
వాస్తవాధీన రేఖ (LAC)ని ఏకపక్షంగా మార్చేందుకు చైనా చేసే ప్రయత్నాలను భారత దేశం సహించే ప్రసక్తే లేదని
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (LAC)ని ఏకపక్షంగా మార్చేందుకు చైనా చేసే ప్రయత్నాలను భారత దేశం సహించే ప్రసక్తే లేదని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) బుధవారం పార్లమెంటుకు తెలిపారు. సరిహద్దుల్లో దళాలను మోహరించడాన్ని చైనా కొనసాగిస్తే, ఆ ప్రభావం ఇరు దేశాల సంబంధాలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మన దేశ విదేశాంగ విధానంలో తాజా పరిణామాలను ఆయన వివరించారు.
వాస్తవాధీన రేఖను మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నిస్తే తాము సహించబోమని చైనాకు దౌత్యపరంగా స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు. సరిహద్దుల్లో దళాల మోహరింపును ఇంకా కొనసాగిస్తే, ఆ ప్రభావం ఇరు దేశాల సంబంధాలపై తీవ్రంగా ఉంటుందని, సాధారణంగా ఉండబోదని, ఆ అసాధారణ పరిస్థితులు గత కొద్ది సంవత్సరాల నుంచి కనిపిస్తున్నాయని తెలిపారు.
జైశంకర్ అక్టోబరులో భారత దేశానికి చైనా దౌత్యవేత్త సున్ వీడోంగ్‌ను కలిశారు. మన దేశంలో సున్ పదవీ కాలం ముగించుకుని తిరిగి చైనా వెళ్తున్న సమయంలో ఈ భేటీ జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలంటే సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ఆ తర్వాత జైశంకర్ ఇచ్చిన ట్వీట్‌లో, మూడు పరస్పర ప్రయోజనాల మార్గదర్శనంలో భారత్-చైనా సంబంధాల పురోగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఉభయ దేశాలు, ఆసియా, అదేవిధంగా ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్-చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరడం చాలా అవసరమని పేర్కొన్నారు.