Karnataka : సొంత పార్టీ ఎంపీపై కేసు పెట్టిన కర్ణాటక బీజేపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-12-29T15:24:06+05:30 IST
భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ (Pragya Singh Thakur)పై కేసు నమోదు చేసింది. శివమొగ్గ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్ఎస్ సుందరేశ్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకుంది. ఓ హిందూ సంస్థ ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ఆమె రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మధ్య ప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె కర్ణాటకలోని శివమొగ్గలో హిందూ జాగరణ వేదిక డిసెంబరు 25న నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘‘మన ఇంట్లోకి చొరబడినవారికి దీటుగా సమాధానం చెప్పాలి. మీ ఇళ్లల్లో ఆయుధాలు పెట్టుకోండి. ఆయుధాలు లేకపోతే కనీసం కూరగాయలు తరిగే కత్తులనైనా పదునుగా ఉంచుకోండి. ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మన ఇంట్లోకి ఎవరైనా చొరబడి, మనపై దాడి చేసినపుడు దీటుగా సమాధానం చెప్పడం మన హక్కు’’ అని అన్నారు.
ప్రజ్ఞా సింగ్ వ్యాఖ్యలపై టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే, రాజకీయ విశ్లేషకుడు తహసీన్ పూనావాలా మంగళవారం ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయని, అధికార పరిధి ఉన్న పోలీసు అధికారిని సంప్రదించాలని శివమొగ్గ పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేత హెచ్ఎస్ సుందరేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రజ్ఞా సింగ్‌పై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 153ఏ, 295ఏ ప్రకారం కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య మతం, జాతి ప్రాతిపదికపై శత్రుత్వాన్ని ప్రోత్సహించారని, మతం, మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా కించపరచడం ద్వారా ఆ మతస్థుల మనోభావాలను భంగపరచారని ఆరోపించారు.