Karnataka : హిజాబ్‌కు అనుమతించే కళాశాలల ఏర్పాటుపై సీఎం స్పందన

ABN , First Publish Date - 2022-12-02T16:04:49+05:30 IST

కర్ణాటకలో హిజాబ్ ధరించడానికి అనుమతిచ్చే 10 పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు అనుమతి వచ్చినట్లు

Karnataka : హిజాబ్‌కు అనుమతించే కళాశాలల ఏర్పాటుపై సీఎం స్పందన
Basavaraj Bommai

బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ ధరించడానికి అనుమతిచ్చే 10 పాఠశాలలు, కళాశాలల ఏర్పాటుకు అనుమతి వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) స్పందించారు. తమ ప్రభుత్వం దీనిపై చర్చించలేదని తెలిపారు. తమ ప్రభుత్వ వైఖరి ఇది కాదన్నారు.

కర్ణాటక రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మౌలానా షఫీ సాది ఇటీవల మాట్లాడుతూ, ముస్లిం విద్యార్థినుల కోసం దక్షిణ కన్నడ, శివమొగ్గ, కొడగు, చిక్కోడి, నిప్పణి, కలబురగి, విజయపుర, బాగల్‌కోట్ జిల్లాల్లో కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటి ఏర్పాటుకు హజ్, వక్ఫ్ శాఖ మంత్రి శశికళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో చర్చించేందుకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపించామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కొన్ని హిందూ సంఘాలు ఘాటుగా స్పందించాయి. ఈ కళాశాలలకు అనుమతి ఇస్తే తాము నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ గురువారం మాట్లాడుతూ, ముస్లిం విద్యార్థినుల కోసం కళాశాలల ఏర్పాటు గురించి తమ ప్రభుత్వం చర్చించలేదన్నారు.

మంత్రి శశికళ స్పందిస్తూ, తమ ప్రభుత్వంలో ఇటువంటి చర్చ జరగడం లేదని స్పష్టం చేశారు. కళాశాలల ఏర్పాటు గురించి జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇవ్వాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌ను కోరానని చెప్పారు.

అనంతరం సాది మాట్లాడుతూ, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ప్రత్యేకంగా ముస్లింల కోసం పాఠశాల ఏర్పాటు ప్రతిపాదన లేదన్నారు. తమ వద్ద రూ.25 కోట్లు ఉన్నాయని, 10 జిల్లాల్లో మహిళా కళాశాలల ఏర్పాటు కోసం రూ.2.5 కోట్లు కేటాయిస్తామని చెప్పానని తెలిపారు.

Updated Date - 2022-12-02T16:05:01+05:30 IST