Kejriwal massage center: తీహార్ జైలు బయట పోస్టర్లు
ABN , First Publish Date - 2022-11-02T11:54:25+05:30 IST
న్యూఢిల్లీ: తీహార్ జైలు గేటు నెంబర్ 1 వద్ద కేజ్రీవాల్ వివాదాస్పద పోస్టర్లు వెలిసాయి.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra jain)కు తీహార్ జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారంటూ ఈడీ ఆరోపించిన మరుసటి రోజే జైలు గేటు నెంబర్ 1 వద్ద కేజ్రీవాల్ వివాదాస్పద పోస్టర్లు వెలిసాయి. ''కేజ్రీవాల్ మసాజ్ సెంటర్'' (Kejriwal Massage center) అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్లు కనిపించాయి. ఇందులో కేజ్రీవాల్ మసాజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మనీలాండరింగ్ కేసు కింద 2017లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సత్యేంద్ర జైన్‌ను ఈడీ ఇటీవల అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. జైలులో ఆయన రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఈడీ మంగళవారంనాడు కోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఇందుకు సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా అందజేసింది.
జైలులో సత్యేంద్ర జైన్‌కు మసాజ్ వంటి పలు సౌకర్యాలు అందుతున్నాయనీ, విచారణ నిబంధనలకు విరుద్ధంగా జైలు సూపరింటెండె ప్రతిరోజూ మంత్రిని కలుసుకుని యోగక్షేమాలు విచారిస్తున్నారని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటి నుండి జైలుకు భోజనం వస్తోందని ఈడీ ఆరోపించింది. జైన్ భార్య పూనం తరచు జైలులో ఆయనను కలుస్తోందని, ఇది జైలు నిబంధనలకు విరుద్ధమని అఫిడవిట్‌లో ఈడీ తెలిపింది. జైన్ తరచు తన సెల్‌లో ఇతర నిందితులైన అంకుష్ జైన్, వల్లభ్ జైన్‌ను కలుసుకుంటున్నారని, ఇది కేసు విచారణకు మంచిదికాదని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను జైలు అధికారులు ఖండించగా, గుజరాత్‌లో బీజేపీ దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుండటం, మోర్బి బ్రిడ్జి విషాద ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.