Parliament : పార్లమెంటు సభ్యులకు లోక్‌సభ స్పీకర్ హెచ్చరిక
ABN , First Publish Date - 2022-12-12T19:53:04+05:30 IST
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాటలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను కదిలించాయి. సభలో ఇతరుల
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మాటలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)ను కదిలించాయి. సభలో ఇతరుల కుల, మతాలను ప్రస్తావించవద్దని సభ్యులందరినీ హెచ్చరించే విధంగా ప్రేరేపించాయి. ప్రజలు కుల, మతాల ప్రాతిపదికపై లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడం లేదని గుర్తు చేసేలా చేశాయి.
అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘భారత దేశ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఒక డాలర్‌కు రూ.83 స్థాయికి పతనమైంది. ఇంత క్షీణత నమోదు కావడం ఇదే మొదటిసారి. దీనిని ప్రభుత్వం గమనించిందా? ఈ పతనాన్ని నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలేమిటి? ప్రభుత్వం వద్ద ఓ కార్యాచరణ ప్రణాళిక ఉందా?’’ అని హిందీలో ప్రశ్నించారు. 2013లో అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను ప్రస్తావించారు. ‘‘నేడు రూపాయి ఐసీయూలో ఉంది. తమిళులు ఈ వ్యక్తిని ఢిల్లీకి ఎందుకు పంపించారో నాకు అర్థం కావడం లేదు’’ అని మోదీ 2013 అక్టోబరులో ట్వీట్ చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారని తెలిపారు. రూపాయిని ఐసీయూ నుంచి తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రభుత్వం వద్ద కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు.
దీనికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం చెప్తూ, కాంగ్రెస్ సభ్యుడు వచ్చీరాని హిందీ (weak Hindi)లో ప్రశ్న అడిగారని, తాను కూడా వచ్చీరాని హిందీలోనే సమాధానం చెబుతానని తెలిపారు. ప్రతి కరెన్సీతోనూ భారతీయ రూపాయి బలంగా ఉందని చెప్పారు. రిజర్వు బ్యాంకు విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించిందని, డాలర్-రూపాయి హెచ్చుతగ్గులు మితిమీరకుండా చూసేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోవాలని చెప్పారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దీనిని కులం కోణంలోకి మళ్లించారు. తాను శూద్రుడ్ననీ స్వచ్ఛమైన హిందీ మాట్లాడేది బ్రాహ్మణవాదులేననీ అన్నారు. ఈ వివాదంపై విశ్లేషకుల అభిప్రాయం ఏమిటంటే, తెలంగాణ వారి హిందీలో ఉర్దూ కలుస్తుంది కాబట్టి వారికి శుద్ధమైన హిందీ రాదనీ, తాను తమిళియన్‌ని కాబట్టి హిందీ సరిగా రాదనీ ఆమె మాటల్లోని అంతరార్థం అయి ఉండవచ్చునని, అందులో రేవంత్ రెడ్డి మాట్లాడిన హిందీని అవమానించిందేమీ లేదని చెప్తున్నారు.
తాను నిమ్న కులస్థుడినని, నిర్మల సీతారామన్ బ్రాహ్మణ వర్గానికి చెందినవారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఓం బిర్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు కులమతాల ప్రాతిపదికపై లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడం లేదని గుర్తు చేశారు. సభలో ఎవరూ ఇటువంటి పదాలను వాడకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ అటువంటి పదాలను ఎవరైనా వాడితే, ఆ సభ్యునిపై తాను చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రశ్నను అడుగుతూ, ‘‘నాకు అంతరాయం కలిగించవద్దు’’ అని ఓం బిర్లాను ఉద్దేశించి అన్నారు. దీనిపై కూడా ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని కాంగ్రెస్ పార్టీ సభ్యులకు చెప్పాలని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరిని కోరారు.
‘‘మీరు (అధిర్ రంజన్ చౌదరి) సభా నేత. ‘మీరు (స్పీకర్) అంతరాయం కలిగించొద్దు’ అని స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడకూడదని సభ్యులకు అవగాహన కల్పించండి. నేనేం చెప్పానో మీకు అర్థమైందా?’’ అని ఓం బిర్లా అన్నారు. అనంతరం ప్రశ్నను అడిగేందుకు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.
ఇదిలావుండగా, భారతీయ కరెన్సీ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోల్చితే 35 పైసలు తగ్గి, రూ.82.63 స్థాయికి దిగజారింది.