Income tax notice : ఆయన ఓ దినసరి కూలీ... అయినా రూ.14 కోట్లు చెల్లించాలంటున్న ఆదాయపు పన్ను శాఖ...
ABN , First Publish Date - 2022-12-20T16:56:59+05:30 IST
ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి వచ్చిన నోటీసును చూసిన మనోజ్ యాదవ్ కుటుంబం
పాట్నా : ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) నుంచి వచ్చిన నోటీసును చూసిన మనోజ్ యాదవ్ కుటుంబం షాక్‌కు గురైంది. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని పరిస్థితిలో ఉన్న తమను రూ.14 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించాలని కోరడమేమిటని ఆందోళనకు గురైంది. ఆ కుటుంబ సభ్యుల ఆర్థిక స్థితిగతులను చూసిన ఐటీ శాఖాధికారులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన నోటీసును తాము మనోజ్‌కు అందజేశామని, ఆయన ఆర్థిక స్థితిగతులు దయనీయంగా ఉన్నాయని పేర్కొన్నారు.
బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లా, కర్గహర్ గ్రామంలో మనోజ్ యాదవ్ ఉంటున్నారు. ఆయన కోవిడ్-19 మహమ్మారికి ముందు ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో రోజు కూలీ చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకునేవారు. మహమ్మారి వచ్చిన తర్వాత తన స్వగ్రామానికి వచ్చి నివసిస్తున్నారు.
ఐటీ శాఖాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, తమ శాఖకు చెందిన అధికారుల బృందం శనివారం మనోజ్ యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. రూ.14 కోట్లు ఆదాయపు పన్ను చెల్లించాలని కోరుతూ నోటీసును అందజేసినట్లు తెలిపారు. మనోజ్ బ్యాంకు రికార్డుల ప్రకారం ఆయన కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోందన్నారు.
మనోజ్ యాదవ్ ఐటీ అధికారులతో మాట్లాడుతూ, తాను రోజు కూలీనని, తన యావదాస్తిని అనేకసార్లు అమ్మినప్పటికీ రూ.14 కోట్లు చెల్లించలేనని చెప్పినట్లు తెలుస్తోంది. తాను ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో వేర్వేరు చోట్ల అనేక ప్రైవేట్ కంపెనీల్లో పని చేశానని, ఆ సమయంలో ఆయా కంపెనీల యజమానులు తన ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల నకళ్ళను తీసుకునేవారని చెప్పినట్లు సమాచారం. కోవిడ్ మహమ్మారి రావడంతో ఆయన కుటుంబం 2020లో తిరిగి స్వగ్రామానికి వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ నోటీసు వచ్చిన తర్వాత ఆ కుటుంబం గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సమాచారం.